కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంగళవారం కలెక్టర్ స్నేహ శబరీష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతంతో కలెక్టరేట్ ప్రాంగణం మార్మోగింది. అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. కలెక్టరేట్‌ను సందర్శించే ప్రజలు, అధికారులకు ఈ విగ్రహం ప్రేరణగా నిలుస్తుందన్నారు. తెలంగాణ గౌరవం, సంప్రదాయాలు, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా విగ్రహం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, ఆర్‌అండ్‌బీ ఈఈ సురేశ్‌బాబు, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, డీటీఓ శ్రీనివాస్‌కుమార్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


