ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు
వరంగల్ క్రైం: కమిషనరేట్ పరిధిలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేలా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని సీపీ పోలీస్ అధికారులతో మంగళవారం వీడియో సమావేశాన్ని నిర్వహించారు. తొలి విడత ఎన్నికలు జరిగే పరిధి పోలీస్ అధికారులతో మాట్లాడి తీసుకుంటున్న బందోబస్తు ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు. అధికారులకు పలు సూచనలిచ్చారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడానికి ప్రతీ పోలీస్ సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎన్నికల వేళ పోలీసులు గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తూ పోలింగ్ కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో గుంపులుగా లేకుండా జాగ్రత్త పడాలన్నారు. ఏదైనా సమస్య తలెత్తితే సమాచారమివ్వాలని, అదనపు బలగాల్ని పంపించనున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు సమయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని, లెక్కింపు పూర్తయ్యి సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ఎన్నికయ్యే వరకు బందోబస్తు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీసీపీలు అంకిత్‌కుమార్, కవిత, రాజమహేంద్ర నాయక్‌తో పాటు అదనపు డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు.
సీపీ సన్‌ప్రీత్ సింగ్
అధికారులతో వీడియో కాన్ఫరెన్స్


