ఘనంగా వ్యవసాయ విద్యా దినోత్సవం
హన్మకొండ/వరంగల్: వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలోని వ్యవసాయ కళాశాలలో ఘనంగా వ్యవసాయ విద్యా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని పాఠశాలల విద్యార్థులు వ్యవసాయ కళాశాలను సందర్శించారు. 396 మంది విద్యార్థులు, 16 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వ్యవసాయ రంగంలో సాధిస్తున్న ప్రగతి, పరిశోధనలను వివరించారు. అనంతరం విద్యార్థులు కళాశాలలోని సేద్య విభాగం, మృత్తిక శాస్త్రం, ఇంజనీరింగ్, పంటల సంరక్షణ ప్రయోగశాల, వృక్ష ప్రజనన విభాగాలు, ఉద్యాన ప్రయోగశాలలను సందర్శించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ అంశాలు తెలుసుకున్నారు. విత్తనరకాలు, విత్తే పద్ధతులు, మట్టి పరీక్ష విధానం, నేల రకాలు, నేలలో పోషకాలు, వివిధ పనిముట్లు, వాటి వినియోగం, ఉద్యాన పంటలు, వాటి యాజమాన్యం, పంటల్లో వచ్చే తెగుళ్లు, పురుగుల యాజమాన్యంపై కళాళాలలో వ్యవసాయ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు పాఠశాల విద్యార్థులకు వివరించారు. కళాశాలలో వానపాముల ఎరువు తయారీవిధానం, వ్యవసాయంలో వాటి వినియోగాన్ని తెలుసుకున్నారు. క్షేత్ర సందర్శన చేసిన విద్యార్థినీవిద్యార్థులకు ‘భారతదేశంలో వ్యవసాయరంగం పాత్ర’ అంశంపై క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల డీన్ డాక్టర్ వి.రవీంద్ర నాయక్, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.


