జీతం సరిపోక పని చేస్తున్న షాపులోనే చోరీ..
● వ్యక్తి అరెస్ట్, రిమాండ్
● వివరాలు వెల్లడించిన పోలీసులు
కాజీపేట అర్బన్ : జీతం సరిపోక పని చేసిన షాపులోనే చోరీకి పాల్పడిన వ్యక్తిని మడికొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌స్పెక్టర్ పుల్యాల కిషన్ కథనం ప్రకారం.. మడికొండ పీఎస్ పరిధిలోని రాంపూర్ ఇండస్ట్రీయల్ ఏరియాలో మంగళవారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అదుపులోకి విచారించగా తాను ఉత్తరప్రదేశ్‌లోని హర్‌బస్పూర్ గ్రామానికి చెందిన ఉమాకాంత్‌యాదవ్‌గా తెలిపాడు. రెండేళ్ల క్రితం వరంగల్‌కు విచ్చేసి మడికొండ ఇండస్ట్రీయల్ ప్రాంతంలోని నల్ల రాజ్యలక్ష్మి పవర్‌లూమ్ కంపెనీలో పని చేసే వాడినని తెలిపాడు. యజమాని ఇచ్చే జీతం సరిపోక రూ. 6.5లక్షల విలువైన ప్యానల్ బోర్డ్స్, ఫిల్టర్స్, డ్రాప్ పిన్ బాక్స్‌లను రెండేళ్ల క్రితమే చోరీ చేశాడు. అప్పుడే విక్రయిస్తే పట్టుబడుతానని ఓ కంటైనర్‌లో దాచి తాళం వేసి స్వగ్రామం వెళ్లిపోయాడు. మంగళవారం ఆ వస్తువులు అమ్మేందుకు వచ్చి పోలీసులకు పట్టుబడగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.


