ఒంగోలు ఆర్ట్ ఫెస్ట్‌కు సాగంటి మంజుల పెయింటింగ్
హన్మకొండ చౌరస్తా: ఒంగోలు ఆర్ట్ ఫెస్ట్–2025 (ఆర్ట్ ఎగ్జిబిషన్)కు హనుమకొండలోని గోపాలపూర్‌కు చెందిన సాగంటి మంజుల గీసిన చిత్రం ఎంపికైంది. హైదరాబాద్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ కేంద్రంగా.. ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు ఈ ఫెస్ట్ నిర్వహించనున్నారు. ‘భారతీయ సాంప్రదాయ గృహాలు’ అంశంపై రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు వంద మంది ప్రముఖ ఆర్టిస్టులు పాల్గొనే ప్రదర్శనకు తన పెయింటింగ్ ఎంపికవడంపై సాగంటి మంజుల సంతోషం వ్యక్తం చేశారు.
వరంగల్ స్పోర్ట్స్: ఈనెల 4న హనుమకొండ, వరంగల్, జనగామ, ములుగు, భూపాలపల్లి, మహబూబ్‌బాద్ జిల్లాల అండర్–16 క్రికెట్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరుణాపురం సమీపంలోని వంగాలపల్లి డబ్ల్యూడీసీఏ క్రికెట్ మైదానంలో ఉదయం 10గంటలకు ఎంపిక పోటీలు ఉంటాయని తెలిపారు. ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికై న ఉమ్మడి వరంగల్ జట్టు హెచ్‌సీఏ ఆధ్వర్యంలో త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయిలో పాల్గొంటుందని పేర్కొన్నారు. జిల్లా స్థాయి ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు సెప్టెంబర్ 01, 2009 నుంచి ఆగస్టు 31, 2011 మధ్య జన్మించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు మీసేవ నుంచి తీసుకున్న పుట్టినతేదీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, సొంత క్రికెట్ కిట్‌తో 6న ఉదయం 10గంటలకు వంగాలపల్లి మైదానం వద్ద హాజరు కావాలని సూచించారు.
హన్మకొండ చౌరస్తా: హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఇనగాల వెంట ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జనగామ, మహబూబాబాద్ డీసీసీ చైర్‌పర్సన్లు ధన్వంతి, ఉమ ఉన్నారు.
హన్మకొండ: వరంగల్ ఓసిటీలోని టీజీ ఎన్పీడీసీఎల్ 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌లో ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న లైన్‌మెన్ పి.ప్రభాకర్ మద్యం సేవించి విధులకు హాజరైనట్లు గుర్తించి సస్పెండ్ చేసినట్లు ఎన్పీడీసీఎల్ వరంగల్ టౌన్ డీఈ శెంకేశి మల్లికార్జున్ తెలిపారు. విద్యుత్ సిబ్బంది జాగ్రత్తగా విధులు నిర్వహిస్తూ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.
హన్మకొండ: పెగడపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి ఎం.యశ్వంత్‌ను విధుల నుంచి తొలగిస్తూ హనుమకొండ జిల్లా శాఖ అధికారి బి.సంజీవరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్థానంలో మల్లారెడ్డిపల్లి సెక్రటరీ గణేశ్‌కు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. పెగడపల్లి సొసైటీలో రుణమాఫీ ప్రతిపాదనల్ని నిబంధనలకు విరుద్ధంగా పంపడం, రైతుల రుణ ఖాతాల నిర్వహణలో వైఫల్యం, సంఘానికి చెందిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లను సకాలంలో ఆదాయపు పన్ను శాఖకు సమర్పించకుండా నిర్లక్ష్యం, అలసత్వం వహించినందుకు ఎం.యశ్వంత్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.
జిల్లాస్థాయి విద్యావైజ్ఞానిక
ప్రదర్శనలు వాయిదా
విద్యారణ్యపురి: ఈనెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు నిర్వహించాల్సిన హనుమకొండ జిల్లా స్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శనలు వాయిదా వేసినట్లు జిల్లా ఇన్‌చార్జ్ డీఈఓ ఎ.వెంకటరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సేయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్‌లో ఇన్స్‌పైర్, సైన్స్‌ఫెయిర్‌ను నిర్వహించేందుకు నిర్ణయించినప్పటికీ కొందరు హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో ఉన్నందున ఆయా వైజ్ఞానిక ప్రదర్శనలు వాయిదా వేసినట్లు తెలిపారు. ఎన్నికల అనంతరం మళ్లీ ఎప్పుడు వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తారనేది ప్రకటిస్తామని తెలిపారు.


