భవిత.. ‘ప్రత్యేక’ పిల్లలకు భరోసా
విద్యారణ్యపురి: ప్రత్యేక అవసరాల పిల్లలకు భవిత కేంద్రాలు భరోసాగా నిలుస్తున్నాయి. ఈకేంద్రాల్లో ప్రత్యేక అవసరాల పిల్లలకు విద్యతోపాటు వివిధ స దుపాయాలు కల్పిస్తున్నారు. అవసరమైన పిల్లలకు ఫిజియోథెరపీ అందిస్తున్నారు. భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ ద్వారా అర్హత కలిగిన ప్రత్యేకావసరాల పిల్లలకు కృత్రిమ అవయవాలను కూడా పంపిణీ చేస్తున్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు (బుధవారం) హనుమకొండ జిల్లాలోని 14 మండలాల్లో ఉన్న భవిత కేంద్రాల్లో దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు విద్యార్థులకు క్రీడాపోటీలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. ఈమేరకు ఇన్‌చార్జ్ డీఈఓ ఎ.వెంకటరెడ్డి ఈ వేడుకలను భవిత కేంద్రాల్లో నిర్వహించాలని ఎంఈఓలను ఆదేశించారు.
మండలానికి రూ.10 వేలు
భవిత కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించేందుకు రూ.10 వేల నిధులు కూడా కేటాయించారు. ఎంఈఓలు ఆయా నిధులు వినియోగించాల్సి ఉంటుంది. కాగా, నేటి దివ్యాంగుల దినోత్సవానికి ప్రత్యేక అవసరాలుగల చిన్నారుల తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేయాల్సి ఉంటుంది. భవిత కేంద్రాల్లో పిల్లలకు అందిస్తున్న సదుపాయాల గురించి వారికి తెలియజేయాల్సి ఉంటుంది. హనుమకొండ జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రత్యేక అవసరాల పిల్లలు 5 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వారు 1,801 మంది ఉన్నట్లుగా గుర్తించారు. 14 భవిత కేంద్రాల్లో 158 మంది ప్రత్యేక అవసరాల పిల్లలు విద్యాభ్యాసం చేస్తుండగా.. 72 మందికి గృహ ఆధారిత విద్య అందిస్తున్నారు. జిల్లాలో 143 మంది పిల్లలు ఫిజియోథెరపీ సేవలు పొందుతున్నారు. మిగతా కొందరు పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు.
153 మంది పిల్లలకు ఉపకరణాలు..
ఈవిద్యాసంవత్సరం ఆగస్టులో నిర్వహించిన ప్రత్యేక అవసరాల పిల్లలకు వైకల్య స్థాయి నిర్ధారణ శిబిరం నిర్వహించగా 174 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో 153 మందికి 225 ఉపకరణాలు మంజూరయ్యాయి. ఈవిద్యాసంత్సరం మొదటి నాలుగు నెలలకుగాను పీఎం శ్రీ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రూ.37,680 ఉపకార వేతనం కూడా మంజూరైంది. జిల్లాలోని 14 మండలాల్లో గల ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ఫిజియోథెరపీ అందించేందుకు ప్రస్తుతం ఆరుగురు ఫిజియోథెరపిస్టులు అందుబాటులో ఉన్నా రు. మరో 8 మందిని ఈనెలలో నియమించనున్నారు.
క్రీడా సాంస్కృతిక పోటీలు
జిల్లాలోని ప్రత్యేక అవసరాల పిల్లలకు భవిత కేంద్రాల్లో ఈనెల 3న దివ్యాంగుల దినోత్సవ వేడుకల సందర్భంగా క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేయాల్సి ఉంటుంది. మండలానికి రూ.10 వేల చొప్పున కేటాయించిన నిధులు వినియోగించుకోవాల్సి ఉంటుంది.
– బద్దం సుదర్శన్‌రెడ్డి, జిల్లా కమ్యూనిటీ
మొబిలైజింగ్ కో–ఆర్డినేటర్, హనుమకొండ
విద్యతోపాటు పలు సదుపాయాలు కల్పిస్తున్న కేంద్రాలు
నేడు దివ్యాంగుల దినోత్సవం
తల్లిదండ్రులకు ఆహ్వానం


