ముగిసిన పీఎం శ్రీ పాఠశాలల క్రీడలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహించిన పీఎంశ్రీ పాఠశాలల క్రీడా పోటీలు శనివారం ముగిశాయి. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడల్లో నిర్వహించిన పోటీలను ఇన్‌చార్జ్ డీఈఓ వెంకట్‌రెడ్డి, డీవైఎస్‌ఓ అశోక్‌కుమార్ పర్యవేక్షించగా, కో–ఆర్డినేటర్ మహేశ్, ఎస్‌జీఎఫ్ జిల్లా సెక్రటరీ ప్రశాంత్, ప్రాక్టీసింగ్ స్కూల్ హెచ్‌ఎం జగన్నాథం, పీఈటీలు పార్థసారథి, సుధాకర్, ప్రభాకర్‌రెడ్డి, సుభాశ్, వాసు, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
కాజీపేట అర్బన్: విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల న్యాయమూర్తులు డాక్టర్ కె.పట్టాభిరామారావు, నిర్మలా గీతాంబ, ఏసీబీ కోర్టు వరంగల్ న్యాయమూర్తి క్షమాదేశ్‌పాండే అన్నారు. హంటర్‌రోడ్డులోని వ్యాసవాసంలో శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ హనుమకొండ, వరంగల్ ఆధ్వర్యంలో ఇండియన్ బ్యాంక్ కాజీపేట సౌజన్యంతో ఏర్పాటు చేసిన చట్టాలపై అవగాహన శిబిరానికి ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడారు. నేర రహిత సమాజ నిర్మాణానికి చట్టాలు దోహదపడతాయని, అవగాహనతో చట్టాల వినియోగం సాధ్యమవుతుందన్నారు. వ్యాసవాసంలోని చిన్నారులకు కంప్యూటర్, ప్రింటర్‌ను బహూకరించారు. కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరీలు ఉషాక్రాంతి, సాయికుమార్, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ: భారతీయ జనతా పార్టీ జిల్లాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు ఇన్‌చార్జ్‌ల పేర్లను శనివారం ప్రకటించారు. హనుమకొండ జిల్లాకు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ (భువనగిరి)ను ఇన్‌చార్జ్‌గా నియమించారు. వరంగల్‌కు కొండపల్లి శ్రీధర్ రెడ్డి (ఖమ్మం), జయశంకర్ భూపాలపల్లికి దశమంత రెడ్డి (జనగామ), మహబూబాబాద్‌కు డాక్టర్ జరుపులావత్ గోపి (నల్లగొండ), ములుగు జిల్లాకు డాక్టర్ కోరండ్ల నరేశ్ (రంగారెడ్డి), జనగామ జిల్లాకు కట్ట సుధాకర్‌రెడ్డి (నాగర్ కర్నూల్)ను ఇన్‌చార్జ్‌గా నియమించారు.
ఖిలా వరంగల్: చారిత్రక ప్రసిద్ధి చెందిన మధ్యకోటను శనివారం కేంద్ర పురావస్తుశాఖ హైదరాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ నిహాల్ దాస్ సందర్శించారు. ఈసందర్భంగా శిల్పాల ప్రాంగణంలోని శిల్పకళా సంపదను తిలకించారు. అనంతరం శృంగారపు బావి, ఇటీవల కూలిపోయిన రాతికోట ముఖద్వారం పక్కన రాళ్లు, రాతికోట ఉత్తరద్వారంలో నిలిచిన నీటిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శృంగారపు బావితోపాటు రాతికోట ఉత్తర ద్వారం వద్ద నిలిచిన నీళ్లను పంపించి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పడమరకోట ముఖ ద్వారం వద్ద కూలిన భారీ రాళ్లను క్రమ పద్ధతిలో పెట్టేందుకు చర్యలు చేపడతామన్నారు. ఆయన వెంట కేంద్ర పురావస్తుశాఖ డీఈ కృష్ణ చైతన్య, సీఏలు, సిబ్బంది పాల్గొన్నారు
హసన్‌పర్తి: సర్వర్ డౌన్ కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించాల్సిన ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. నగరంలోని టీఎస్ ఆయాన్ డిజిటల్ (వడ్డేపల్లి సమీపంలోని ఫిల్టర్ బెడ్ ప్రాంతం) సెంటర్‌ను కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు ఎనిమిది వందల మంది పరీక్ష రాసేందుకు ఇక్కడి వచ్చారు. ఉదయం 7 గంటలకే రిపోర్ట్ చేయాలని నిబంధన ఉండడంతో సెంటర్ ఎక్కడుందో తెలియక అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. సర్వర్ డౌన్ కారణంగా ఉదయం 5 గంటలకు పరీక్ష కోసం బయల్దేరి అభ్యర్థులు మధ్యాహ్నం ఒంటి గంటకు పరీక్ష రాసి బయటకు వచ్చారు.
ముగిసిన పీఎం శ్రీ పాఠశాలల క్రీడలు


