‘పంచాయతీ’ పోరు.. పల్లెల్లో జోరు!
సాక్షిప్రతినిధి, వరంగల్:
మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనుండగా.. శనివారం మొదటి విడత నామినేషన్ల ఘట్టం ముగిసింది. రెండో విడత ఎన్నికలకు ఆదివారం నోటిఫికేషన్ వెలువడనుండగా.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఉమ్మడి వరంగల్‌లో ఒక్క ములుగు జిల్లాలోనే రెండు విడతల్లో పల్లెపోరు పూర్తికానుండగా, మిగతా జిల్లాల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో నామినేషన్ల ప్రారంభం రోజున ఎన్నికలు మళ్లీ నిలిపేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో గురువారం, శుక్రవారం రెండు రోజుల్లో మందకోడిగా నామినేషన్లు సాగాయి. శుక్రవారం ‘ఈ సర్పంచ్ ఎన్నికలను ఎవరూ ఆపలేరు’ అంటూ జీఓ 46పై స్టే నిరాకరిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో మొదటి విడత ముగింపు రోజైన శనివారం నామినేషన్లు ఉత్సాహంగా సాగాయి. ఆదివారం నుంచి రెండో విడత నామినేషన్ల పరంపర కూడా సాగనుంది.
● హనుమకొండ జిల్లాలోని 12 మండలాల్లో 210 గ్రామ పంచాయతీలు, 1,986 వార్డులున్నాయి. మొదటి విడతలో భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపుర్ మండలాల్లోని 69 జీపీలు, 658 వార్డులకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రెండో విడతలో ధర్మసాగర్, హసన్‌పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లోని 73 జీపీలు, 694 వార్డులకు నామినేషన్లు నేటి నుంచి ఉంటాయి.
● వరంగల్ జిల్లాలో రెండో విడతలో దుగ్గొండి, నల్లబెల్లి, గీసుకొండ, సంగెం మండలాల్లోని 117 జీపీలు, 1,008 వార్డులకు ఎన్నికలు జరగనుండగా, నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.
.. ఇదిలా ఉండగా నామినేషన్ల సందర్భంగా రిజర్వేషన్ల వారీగా గెలుపు గుర్రాలపై దృష్టి సారించి రంగంలోకి దింపుతున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు.. అభ్యర్థుల గెలుపు కోసం ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
రెండో విడత అన్ని ఏర్పాట్లు చేశాం..
హన్మకొండ అర్బన్ : స్థానిక ఎన్నికల రెండో విడత ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణకు ఎంపీడీఓలు, నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారుల సిద్ధంగా ఉన్నట్లు హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్యశారద శనివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.
రౌడీషీటర్ల బైండోవర్లు
హసన్‌పర్తి: ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు హసన్‌పర్తి పరిధి ఆయా గ్రామాల్లోని రౌడీషీటర్లు, బెల్ట్‌షాపుల నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని శనివారం తహసీల్దార్ కిరణ్‌కుమార్ ఎదుట హాజరుపర్చారు.
హైకోర్టు తీర్పు తర్వాత ఆశావహుల్లో జోష్
మూడు రోజులు వేచి చూసే ధోరణి
ముగిసిన మొదటి విడత..
నేటి నుంచి రెండో విడత
అభ్యర్థుల గెలుపుపై
వ్యూహాత్మకంగా పార్టీలు


