తరగతి గది ప్రయోగశాల కావాలి
● పాఠశాల విద్యాశాఖ
ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి
● ముగిసిన వరంగల్ జిల్లాస్థాయి
ఇన్‌స్పైర్, బాల వైజ్ఞానిక ప్రదర్శన
ఖిలా వరంగల్: తరగతి గది ప్రయోగశాల కావాలని పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీ) సత్యనారాయణరెడ్డి సూచించారు. వరంగల్ హంటర్ రోడ్డులోని తాళ్ల పద్మావతి ఇంటర్నేషనల్ స్కూల్‌లో మూడు రోజులుగా నిర్వహించిన వరంగల్ జిల్లాస్థాయి ఇన్‌స్పైర్, బాల వైజ్ఞానిక ప్రదర్శన శనివారం సాయంత్రం ముగిసింది. ముఖ్య అతిథిగా ఆర్జేడీ హాజరై మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో విజ్ఞానశాస్త్రం పాత్ర అమోఘమని పేర్కొన్నారు. శాసీ్త్రయ ఆలోచనలు ఉన్న విద్యార్థులు భవిష్యత్ తరాల అభివృద్ధికి మార్గదర్శకులవుతారని తెలిపారు. డీఈఓ రంగయ్య నాయుడు మాట్లాడుతూ ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను చూస్తే గర్వంగా ఉందన్నారు. జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఇన్‌స్పైర్, బాల వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీస్తాయని చెప్పారు. 16 ఇన్‌స్పైర్ ప్రాజెక్టులు, 14 ఆర్బీవీపీ ఎగ్జిబిట్లను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో అధికారులు ఉండ్రాతి సుజన్‌తేజ, కృష్ణమూర్తి, బి.ప్రసాద్, తాళ్ల పద్మావతి విద్యాసంస్థల చైర్మన్ తాళ్ల మల్లేశం, డైరెక్టర్లు వంశీ, వరుణ్, రాహుల్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, ట్రస్మా ప్రతినిధులు భూపాల్‌రావు, డి.రామ్మూర్తి, వడుప్సా బాధ్యులు రవి, శ్యాం పాల్గొన్నారు
హసన్‌పర్తి: హసన్‌పర్తి మండలం పెగడపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అవకతవకలపై విచారణకు ఆదేశించినట్లు జిల్లా సహకార అఽధికారి సంజీవరెడ్డి తెలిపారు. ఈ మేరకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ కె.రవీంద్రను విచారణాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. రుణమాఫీతో పాటు అధిక వడ్డీ, రుణాల్లో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఎనిమిది మంది పాలకవర్గ సభ్యులతో పాటు రైతులు లిఖిత పూర్వకంగా కలెక్టర్, డీసీఓకు ఫిర్యాదు చేశారు. అలాగే, ఇన్‌కం టాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సహకార సంఘం చట్టం సెక్షన్ 51 కింద విచారణకు ఆదేశించినట్లు డీసీఓ వివరించారు.


