సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో దేశ ఐక్యత
మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితోనే దేశం నేటికీ ఐక్యతతో ఉందని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. శనివారం జీడబ్ల్యూఎంసీ కార్యాలయ ఆవరణలో కేంద్ర యువజన సర్వీసులు క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మై భారత్, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ సంస్థల ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యత పాదయాత్రను మేయర్ జెండా ఊపి ప్రారంభించారు. పోచమ్మ మైదాన్ వరకు పాదయాత్ర సాగింది. బల్దియా కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి మేయర్ సుధారాణి జ్యోతి ప్రజలన చేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా సంస్థానాలుగా విడివిడిగా ఉన్న దేశాన్ని ఒక్కటి చేయడంలో సర్దార్ పటేల్ కృషి చేశారన్నారు. ఆయన ఆశయ సాధన కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. అలాగే డ్రగ్స్ రహిత భారతదేశంగా తీర్చిదిద్దడానికి భారత ప్రభుత్వం చేపట్టిన నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మేరా యువభారత్ వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేశ్, సూపరింటెండెంట్ బానోతు దేవీలాల్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య ఎంఎస్‌ఓ రాజేశ్ టీఎంసీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
లీకేజీలు అరికట్టాలి..
లీకేజీలు అరికట్టి నీటి సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం బల్దియా కార్యాలయంలో ఇంజనీరింగ్, శానిటేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. నగరంలో దెబ్బతిన్న వీధి దీపాల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయాలన్నారు. శానిటేషన్ నిర్వహణలో భాగంగా శానిటరీ ఇన్‌స్పెక్టర్లు వారికి కేటాయించిన డివిజన్లలో కచ్చితంగా చెత్తను వేరు చేసి స్వచ్ఛ ఆటోకు అందించేలా చూడాలని పేర్కొన్నారు.


