బాధితులకు భరోసా..
ఫిర్యాదుల పరిశీలన తర్వాత
చిట్టీ సొమ్ము చెల్లింపు
చిట్‌ఫండ్ బాధితుల ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం వారు చెల్లించిన చిట్టీ డబ్బులను తిరిగి చెల్లిస్తాం. ఫిక్స్‌డ్ డిపాజిట్ రిలీజ్‌లో భాగంగా జాయింట్ అకౌంట్ తెరుస్తాం. ఇందులో సంబంధిత చిట్‌ఫండ్ కంపెనీ చైర్మన్‌తో పాటు నేను ఉంటా. చిట్టీ సొమ్మును జాయింట్ అకౌంట్‌లో నుంచి చెక్కు రూపంలో అందజేస్తాం. ఫిర్యాదు చేయని వారు కూడా ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తాం.
ప్రవీణ్‌కుమార్, రిజిస్ట్రార్, వరంగల్
కాజీపేట అర్బన్ : సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు తమ పిల్లల పెళ్లిళ్లు, విద్య, సొంతింటి కల నెరవేర్చుకోవడానికి తమ నెలసరి ఆదాయంలో కొంత వెచ్చించి పలు చిట్‌ఫండ్స్ కంపెనీల్లో పొదుపు చేసుకుంటారు. అయితే కాలపరిమితి ముగిసినా ఖాతాదారుల సొమ్ము తిరిగి ఇవ్వకుండా చిట్‌ఫండ్, బోర్డు తిప్పేసిన కంపెనీలు వారిని తిప్పుకుంటున్నాయి. దీంతో బాధితులు వివిధ శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కావడం లేదు. ఫలితంగా కన్నీరుమున్నీరవుతున్నారు. ఇలాంటి వారికి శుభవార్త. ఇక నుంచి ఆ గోస తీరనుంది. రిజిస్టర్డ్ చిట్‌ఫండ్ కంపెనీలు తాము ప్రారంభించే చిట్టీకి అనుగుణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను చేస్తే తప్పా చిట్టీ ప్రారంభించే అవకాశం లేదు. దీంతో తాము ప్రారంభించే చిట్టీకి సరిపోయే విధంగా అందుకు అనుగుణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చిట్స్ కార్యాలయానికి చెల్లిస్తారు. చిట్‌ఫండ్ కంపెనీలు చెల్లించిన ఎఫ్‌డీ రూపంలోని సొమ్మును బాధితులకు అందజేయాలని ఎఫ్‌డీ రిలీజ్ పేరిట రిజిస్ట్రేషన్ అండ్ చిట్స్ శాఖ కమిషనరేట్ అక్టోబర్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, చిట్‌ఫండ్ కంపెనీల్లో బాధితుల ఫిర్యాదులను పరిశీలించి సొమ్మును చెల్లించేందుకు జాయింట్ అకౌంట్ ప్రక్రియను ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం.
తొలుత ఆ ఐదు చిట్‌ఫండ్ కంపెనీలు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 168 రిజిస్డర్డ్ చిట్‌ఫండ్ కంపెనీలు తమ లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్ రిలీజ్ ఉత్తర్వుల్లో తొలుత అక్షర, కనకదుర్గ, అచల, భవితశ్రీ, శుభనందిని చిట్‌ఫండ్ కంపెనీల్లో ఫిర్యాదులు పరిశీలించి బాధితులకు చిట్టీ డబ్బులు అందజేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, ఐదు చిట్‌ఫండ్ కంపెనీలు 40 బ్రాంచ్‌లతో లావాదేవీలను కొనసాగించాయి.
రూ. 30 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు..315 ఫిర్యాదులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అక్షర, అచల, కనకదుర్గ, శుభనందిని, భవితశ్రీ చిట్‌ఫండ్ కంపెనీలు 40 బ్రాంచ్‌లతో రూ.50 వేల నుంచి రూ. 50లక్షల వరకు చిట్టీలను ప్రారంభించి లావాదేవీలను కొనసాగించాయి. అయితే ఖాతాదారులకు తిరిగి చెల్లింపు చేయక తిప్పుతుండడంతో కొందరు వరంగల్ ఆర్వో కార్యాలయంలోని సహాయ చిట్స్‌రిజిస్ట్రార్‌తో పాటు జిల్లా రిజిస్ట్రార్‌కు ఫిర్యాదులు చేశారు. అక్కడ సమస్య పరిష్కారం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఐదు చిట్‌ఫండ్ కంపెనీలకు గాను రూ.30 నుంచి రూ.40 కోట్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయని, 315కు పైగా ఫిర్యాదులు ఉన్నాయని, ఫిర్యాదుదారులకు తమ సొమ్మును అందించే అవకాశం ఉందని సమాచారం.
ఫిర్యాదు చేస్తేనే చిట్టీ సొమ్ము..
తాము చిట్‌ఫండ్ కంపెనీలో చేరి చిట్టీ డబ్బులను చెల్లించిన అనంతరం తిరిగి తమకు చెల్లింపులు చేయని పక్షంలో బాధితులు జిల్లా చిట్స్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తేనే ఫిర్యాదుకు అనుగుణంగా చిట్టీ డబ్బులు పొందే అవకాశం ఉంది. కాగా, ఫిర్యాదు చేయని వారికి చిట్‌ఫండ్ కంపెనీలు మొండిచేయ్యి చూపించే అవకాశం ఉంది. అందుకే బాధితులు ఫిర్యాదు చేస్తే సొమ్ము పొందే ఛాన్స్ ఉంటుంది.
తీరనున్న చిట్స్ ఖాతాదారుల గోస
ఫిర్యాదు చేస్తేనే డబ్బులు..
ఫిక్స్‌డ్ డిపాజిట్ రిలీజ్ ఉత్తర్వులు జారీ
తొలుత ఆ ఐదు చిట్‌ఫండ్స్ కంపెనీలకు
అవకాశం


