పదకొండేళ్లు మహిళా రాజ్యం!
గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని జాతీయ ఆదర్శ గ్రామం గంగదేవిపల్లిలో పదకొండేళ్ల పాటు గ్రామపంచాయతీ పాలనను మహిళలే చేపట్టారు. సర్పంచ్ సహా వార్డు సభ్యులందరూ రెండు పర్యాయాలు మహిళలే ఎన్నికై పాలన సాగించడం విశేషం. గంగదేవిపల్లి 1994లో మచ్చాపురం నుంచి విడిపోయి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఆవిర్భవించింది. తర్వాత 1995లో గ్రామపంచాయతీకి తొలి ఎన్నికలు నిర్వహించారు. సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడం, గ్రామంలో 8 వార్డులు ఉండడంతో వారందరినీ మహిళలనే ఎన్నకోవాలని ఆ రోజుల్లో గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. వార్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా సర్పంచ్ పదవికి పోటీ ఉండగా కూసం లలిత ఎన్నికయ్యారు. ప్రశాంత పాలన సాగించాలనే ఉద్దేశంతో నాడు గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామ తొలి సర్పంచ్‌గా కూసం లలిత, వార్డు సభ్యులుగా పెండ్లి సరోజన, కూసం రాజేశ్వరి, దేవులపల్లి విజయ, జంగం వీరలక్ష్మి, మామిండ్ల లక్ష్మి, సల్ల కట్టమ్మ, సింగిరెడ్డి నర్సమ్మ, గోనె లక్ష్మి ఎన్నికై ఐదేళ్లపాటు ( 2001 వరకు) పాలన సాగించారు. ప్రజల సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేశారు. దీంతో రెండో సారి కూడా సర్పంచ్ సహా వార్డు సభ్యులను అందరు మహిళలనే ఎన్నుకోవాలని కొంత మేరకు గ్రామస్తులు అనుకున్నారు. అయితే 2001లో సర్పంచ్ పదవి ఎవరైనా పోటీ చేసే విధంగా జనరల్‌కు రిజర్వ్ చేశారు. దీంతో సర్పంచ్, 8 వార్డు సభ్యుల ప్యానల్‌గా మహిళలు పోటీ చేయగా ఆయా స్థానాల్లో వారితో పురుషులు పోటీ పడ్డారు. అయినా అన్ని స్థానాల్లో మహిళలే గెలుపొంది సత్తా చాటారు. సర్పంచ్‌గా మరో మారు కూసం లలిత ఎన్నికయ్యారు. వార్డు సభ్యులుగా దేవులపల్లి విజయ, కూసం రాజేశ్వరి, సల్ల సాంబలక్ష్మి, సల్ల కట్టమ్మ, మేడిద లక్ష్మి, మేడిద మల్లికాంబ, గూడ రాధమ్మ ఎన్నికై 2006 వరకు పాలన సాగించారు. రెండు పర్యాయాల వారి పాలనతో గ్రామం ఆదర్శంగా నిలవడంతో పాటు ప్రపంచంలోని సుమారు 99 దేశాల ప్రజలు, భారత దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వారు గ్రామ సందర్శనకు రావడానికి నాంది పలికారు. అనంతరం 2006 ఎన్నికల్లో సర్పంచ్ పదవిని బీసీ జనరల్‌కు రిజర్వ్ చేయగా సర్పంచ్‌గా కూసం రాజమౌళి, వార్డు సభ్యులు అందరూ ఏకగ్రీవంగా గెలుపొందారు. ఆ తర్వాత 2013లో సర్పంచ్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ కాగా ఇట్ల శాంతి గెలుపొంది 2018 వరకు కొనసాగారు. 2019లో సర్పంచ్ స్థానం జనరల్‌కు కేటా యించడంతో గోనె మల్లారెడ్డి గెలుపొంది 2024న వరకు పాలన సాగించారు. ఈ సారి సర్పంచ్ పదవి జనరల్ మహిళకు కేటాయించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు ఎలా నిర్ణయిస్తారో వేచి చూడాల్సిందే.
సర్పంచ్, వార్డు సభ్యులందరూ
నారీమణులే..
ప్రత్యేకత చాటుకున్న జాతీయ
ఆదర్శ గ్రామం గంగదేవిపల్లి
ఈ సారి సర్పంచ్ పదవి జనరల్
మహిళకు కేటాయింపు


