చెత్తను ప్రక్షాళన చేయాలి
● తడి, పొడి చెత్తపై దృష్టిసారించాలి
● గ్రేటర్ కమిషనర్
చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్: ఇంటింటా వెలువడుతున్న చెత్తను ఎక్కడికక్కడ ప్రక్షాళన చేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లతో ఆమె సమావేశమయ్యారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ ఆటోలకు రూట్ ఆప్టిమైజేషన్ చేసినందున జవాన్లు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు వారికి కేటాయించిన డివిజన్లు, గృహాల నుంచి చెత్తను సేకరించి ఆటోలకు అందించేలా చూడాలన్నారు. ప్రస్తుతం బయో కంపోస్ట్ యూనిట్లు వచ్చాయని, బయో మిథనైజేషన్ ప్లాంట్ రాబోతోందని, విండ్రో కంపోస్ట్ యూనిట్లు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తడి చెత్త సేకరణకు వీలుగా 20 లీటర్ల సామర్థ్యం గల బిన్‌ను ఆటోలో ఏర్పాటు చేయాలన్నారు. రాంపూర్ డంప్ యార్డుకు చేరే చెత్త పరిమాణం తగ్గించాలని, చెత్త కంపోస్ట్‌గా మారాలన్నారు. సమావేశంలో సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ రాజేశ్, శానిటరీ సూపర్‌వైజర్లు నరేందర్, గోల్కొండ శ్రీను, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


