పాఠశాలల్లో విద్యార్థి కేంద్రీకృత బోధన
కాళోజీ సెంటర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి కేంద్రీకృత బోధన జరుగుతుందని వరంగల్ జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి(సీఎంఓ) కట్ల శ్రీనివాస్ అన్నారు. వరంగల్ నరేంద్రనగర్ పాఠశాలలో శుక్రవారం బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల (పీటీఎం) సమావేశంలో విద్యార్థుల వ్యక్తిగత పురోగతిని తల్లిదండ్రలకు ఉపాధ్యాయులు వివరించారు. హెచ్‌ఎం వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులున్నారు.
బాలలు ఉన్నతస్థాయికి ఎదగాలి
రామన్నపేట: బాలలు ఉన్నతస్థాయికి ఎదగాలని వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి ఎం.సాయికుమార్ అన్నారు. వరంగల్ ఆటోనగర్‌లోని బాలల పరిశీలక గృహంలో శుక్రవారం నిర్వహించిన బాలల దినోత్సవంలో ఆయన మాట్లాడారు. తెలిసీతెలియని వయస్సులో చేసిన తప్పులు తిరిగి చేయకుండా, చట్టవ్యతిరేక పనులకు స్వస్తి చెప్పి క్రమశిక్షణతో జీవనాన్ని కొనసాగించాలని సూచించారు. మంచి మిత్రులతో సహవాసం చేయాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేలా నడుచుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా బాలురకు కల్పిస్తున్న వసతులు, ఆహార పదార్థాల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. బాలలకు మంచి విద్య, సురక్షితమైన వాతావరణం, వసతులు కల్పించే బాధ్యత నిర్వాహకులు తీసుకోవాలని కోరారు. చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సురేశ్, హోం సూపరింటెండెంట్ రమణమూర్తి, జువైనల్ బోర్డు మెంబర్లు సుభాష్, డాక్టర్ గోపికా రాణి, హోం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


