చేప పిల్లల పంపిణీకి మోక్షం
హన్మకొండ చౌరస్తా: హనుమకొండ జిల్లాలో ఎట్టకేలకు ప్రభుత్వ ఉచిత చేప పిల్లల పంపిణీకి మోక్షం కలిగింది. సాధారణంగా చెరువుల్లో జూన్, జూలై నెలల్లో వదలాల్సిన చేప పిల్లల ప్రక్రియ దాదాపు 5 నెలల తర్వాత ప్రారంభిస్తున్నారు. ఆరు నెలల కాలం ముగిసిన తర్వాత ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చేప పిల్లలు ఎదుగుతాయా? అంటే మత్స్యకారులు అసాధ్యమనే సమాధానం చెబుతున్నారు. ఇప్పటికే ఆయా చెరువుల్లో అరకిలో సైజులో ఎది గిన చేపలకు, ఇప్పుడు వేసే సీడ్ ఆహారంగా మార డం తప్పితే పెద్దగా ఫలితం ఉండదని అంటున్నా రు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అధిక శాతం చేపలు వరదలో కొట్టుకుపోయాయని, ఇప్పుడు వేసే చేప పిల్లలు కాస్త ఊరటనిస్తాయని మరికొందరు మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు.
జిల్లాలో 813 చెరువులు..
హనుమకొండ జిల్లాలో మొత్తం 813 చెరువులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆయా చెరువుల్లో కట్ల, రోహు, బంగారు తీగ, మెరిగ జాతి చేప పిల్లలను వదిలేందుకు ప్రణాళికలు రూపొందించారు. హనుమకొండ జిల్లాకు చేపపిల్లల పంపిణీ కాంట్రాక్ట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరానికి చెందిన జయంత్ ఆక్వా ఫిష్ సంస్థ దక్కించుకుంది. ఒక చేప పిల్లకు రూ.1.82 పైసల చొప్పున టెండర్ ఖరారైంది. జిల్లా మొత్తంగా 813 చెరువుల్లో 2,20,54000 చేప పిల్లల (విలువ రూ.2,50,25000)ను పంపిణీ చేయనున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
మంత్రి, ఎమ్మెల్యే రాక..
ఈ నెల 16న (ఆదివారం) ధర్మసాగర్ రిజర్వాయర్‌లో ఉచిత చేప పిల్లల పంపిణీ చేయనున్నట్లు హనుమకొండ జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి తెలిపారు. ఈ రిజర్వాయర్‌లో రూ.22.80లక్షల విలువైన 12,52,500 చేప పిల్లలను వదలనున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్, తదిత అధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు.
రేపు ధర్మసాగర్ రిజర్వాయర్‌లో విడుదల
ఇప్పుడు వేసినా ఎదుగుదల అంతంతే..


