కాజీపేటలో రెచ్చిపోతున్న గిరిగిరి వ్యాపారులు | - | Sakshi
Sakshi News home page

కాజీపేటలో రెచ్చిపోతున్న గిరిగిరి వ్యాపారులు

Nov 7 2025 7:49 AM | Updated on Nov 7 2025 7:49 AM

కాజీప

కాజీపేటలో రెచ్చిపోతున్న గిరిగిరి వ్యాపారులు

రాజ్‌మార్‌ అనే రైల్వే కార్మికుడు తన అవసరాల కోసం ఓ వడ్డీ వ్యాపారి వద్ద రూ.4 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. నెలకు లక్షకు

రూ.5 వేల చొప్పున నాలుగు లక్షలకు రూ.20 వేలు వడ్డీగా చెల్లించాడు. రెండేళ్లపాటు క్రమం తప్పకుండా నెలనెలా వడ్డీ చెల్లించినప్పటికీ ఏడాదికే ఇస్తానని తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వని కారణంగా కాజీపేటలో ఉన్న ప్లాటు తనకు అమ్మాలంటూ డిమాండ్‌ చేయడంతో పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కి న్యాయం పొందాడు.

శ్రీనివాస్‌ అనే వడ్డీ వ్యాపారి ఖాళీ ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులపై సంతకాలు తీసుకుని వడ్డీలకు డబ్బులు ఇస్తాడు. రూ.లక్ష ఇచ్చి మొదట రూ.35 వేలు కట్‌ చేసుకుంటాడు. అప్పు తీసుకున్నవారు నెలకు రూ.5వేల చొప్పున 20 నెలలపాటు చెల్లించాలి. ఏ కారణంచేతనైనా సకాలంలో డబ్బులు చెల్లించలేకపోతే తన వద్ద ఉన్న చెక్కులు, ప్రామిసరి నోట్లపై పెద్దమొత్తంలో రాసుకుని కోర్టులో కేసులు వేసేవాడు. ఇలా ఒక కాజీపేట పట్టణంలో 50కిపైగా కేసులు చిరువ్యాపారులపై ఉన్నాయి.

కాజీపేట : అరకొర జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న రైల్వే కార్మికులు, చిరువ్యాపారులు తమ అవసరాలకు డబ్బుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వీరి అవసరాల దృష్ట్యా వడ్డీ వ్యాపారులు బంగారు ఆభరణాలు, ఏటీఎం కార్డులు, వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాల పత్రాలను తాకట్టు పెట్టుకుని నగదును అందిస్తూ అధిక మొత్తంలో వడ్డీ వసూలు చేస్తున్నారు. దీంతో కార్మికులు వడ్డీలు తీర్చలేక ఇబ్బందులకు గురవుతున్నారు. కాజీపేట పట్టణంలో చిరువ్యాపారులు, కూలీలు, ఎఫ్‌సీఐ, రైల్వే కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు. బోర్డులు లేని ఫైనాన్స్‌ సంస్థలు, గిరిగిరి వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఆభరణాలపై రుణాలిచ్చే పాన్‌బ్రోకర్స్‌ వంటి సంస్థలు ఎటువంటి లైసెన్స్‌లు లేకుండా వడ్డీ వ్యాపారం కొనసాగిస్తున్నాయి.

5నుంచి 15శాతం వరకు వడ్డీ

కాజీపేటలో వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఖాళీ ప్రామిసరి నోట్‌, చెక్కులు తీసుకోవడంతోపాటు మరో వ్యక్తిని జమానత్‌ దారుడిగా పెడితేనే సొమ్ములు ఇచ్చే ఈ ఫైనాన్స్‌ వ్యాపారులు 5నుంచి 15శాతం వరకు అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు. రైల్వే కార్మికులకు వేతనం వచ్చే రోజున వడ్డీ వ్యాపారులు నేరుగా పరిశ్రమల ఎదుట నిలబడి మరీ వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది వ్యాపారులు నేరుగా ఏటీఎం కార్డులను వారి దగ్గరే పెట్టుకుని జీతం పడిన రోజు ఏటీఎం కేంద్రాల నుంచి డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. వారు తీసుకోగా మిగిలిన డబ్బులు మాత్రమే కార్మికులు కుటుంబ అవసరాల కోసం వాడుకోవాలి తప్ప ఇదేంటని అడిగే ధైర్యం ఎవరికీ ఉండదు.

ఇటీవల పెరిగిన ఆగడాలు..

గతంలో కాజీపేట పట్టణంలో వడ్డీ వ్యాపారులపై పోలీసులు దాడులు చేసిన సందర్భంలో కొద్దికాలం మిన్నకుండిపోయిన వ్యాపారులు మళ్లీ ఇటీవల కాలంలో రెచ్చిపోతున్నారు. అనుమతి లేకుండా వ డ్డీ వ్యాపారం చేయడం నేరమని తెలిసినా, అ ధికారుల పట్టింపులేనితనంతో గిరిగిరిలు, వారం, పక్షం, నెలవారీ చిట్టీలు నడుపుతున్నారు. అసలుకు చక్రవడ్డీలు కలుపుతూ కోర్టుల్లో కేసులు వేసి సామాన్యుల నడ్డివిరుస్తున్న వ్యాపారులను గుర్తించి జిల్లా అధికార యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

చర్యలు తీసుకోవాలి..

ప్రజల బలహీనతలు, అవసరాలను ఆసరాగా చేసుకుని రూపాయి అప్పుగా ఇచ్చి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్న వ్యాపారుల ఆటలను కట్టించాలి. సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ కమిషనరేట్‌ పరిధిలో వడ్డీ వ్యాపారుల జాబితా తయారు చేసి నడ్డి విరవాలి.

– బొల్లికొండ కోటేశ్వర్‌, సోమిడి

ఫిర్యాదు చేస్తే చర్యలు..

అనుమతి లేకుండా చిట్టీలు ని ర్వహించడం చట్టరీత్యా నేరం. డబ్బుల కోసం బాధితుల ఇళ్లపైకి వెళ్లి ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదు. బాధితులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

– వై.సుధాకర్‌ రెడ్డి, సీఐ, కాజీపేట

కార్మికులు, చిరువ్యాపారులను పీడిస్తున్న పరిస్థితి

ముందుగానే ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్‌పై సంతకాలు

కిస్తీ చెల్లించకపోతే కోర్టు కేసులతో ముప్పుతిప్పలు

కాజీపేటలో రెచ్చిపోతున్న గిరిగిరి వ్యాపారులు1
1/2

కాజీపేటలో రెచ్చిపోతున్న గిరిగిరి వ్యాపారులు

కాజీపేటలో రెచ్చిపోతున్న గిరిగిరి వ్యాపారులు2
2/2

కాజీపేటలో రెచ్చిపోతున్న గిరిగిరి వ్యాపారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement