డెంగీ డేంజర్ బెల్స్
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిక లెక్కల ప్రకారం..ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ 6 వరకు 240 మంది డెంగీ బారిన పడ్డారు. 4,552 శాంపిల్స్ సేకరిస్తే 240 మందికి డెంగీ నిర్ధారణ అయ్యింది. 100 మందిలో ఐదుగురికిపైగా పాజిటివిటి రేటు నమోదైంది. ముఖ్యంగా జనవరి నుంచి జూలై వరకు ఏడు నెలల కాలంలో 38 డెంగీ కేసులు నమోదైతే.. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌నే 202 కేసులు నమోదుకావడం తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది.
వర్షాలు కురవడంతో లోపించిన పారిశుద్ధ్యం..
గత నాలుగు నెలల్లో వర్షాలు కురవడంతో పల్లెలు, పట్టణాలు చిత్తడిచిత్తడిగా మారాయి. పారిశుద్ధ్య పనులు సైతం అంతంత మాత్రంగానే ఉన్నాయి. పరిసరాల్లో నిల్వ ఉన్న నీటితో డెంగీకి మూలమైన ఫ్లేవీ వైరస్‌ను మోసుకొచ్చే అయిడిస్, ఏషియన్ టైగర్ దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఈ సమయంలోనే సీజనల్ వ్యాధులు సైతం విజృంభిస్తున్నాయి. దీంతో చాలామంది జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సుమారు 3,531 జ్వరాల కేసులు నమోదయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఏడు వేల మందికిపైగా జ్వరంతో చికిత్స తీసుకున్నట్లు తెలిసింది. అక్టోబర్ నెలాఖరులో కురిసిన అతి భారీ వర్షంతో వరంగల్ నగరంలో ఇళ్లలోకి నీరు చేరింది. బురద పేరుకుపోయి, రోడ్లపై చెత్తాచెదారం ఏర్పడి దుర్వాసనతో జ్వరాలు, డెంగీ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
జాగ్రత్తలు తీసుకోవాలి..
తీవ్ర జ్వరం, తలనొప్పి, కళ్ల నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పి, రుచిని కోల్పోవడం, జలుబు, వాంతులు వంటివి డెంగీ లక్షణాలుగా గుర్తించి అప్రమత్తం కావాలి. డెంగీ వచ్చిన తర్వాత ఇబ్బంది పడడం కన్నా.. దాని బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. దోమలు వృద్ధి చెందకుండా ప్రధానంగా ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. పరిశుభ్రత పాటించాలి.
– సాంబశివరావు, డీఎంహెచ్‌ఓ, వరంగల్
వరంగల్ జిల్లాలో 240కి చేరుకున్న పాజిటివ్ కేసులు
అక్టోబర్ నెలాఖరున కురిసిన
వర్షంతో ప్రబలుతున్న వ్యాధులు
జ్వరపీడితులు అప్రమత్తంగా
ఉండాలని వైద్యుల సూచన


