బకాయిలు వెంటనే చెల్లించాలి
కలెక్టరేట్ ఎదుట ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన
హన్మకొండ అర్బన్: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీల యాజమాన్యాల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.సుందర్‌రాజ్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట డిగ్రీ అండ్ పీజీ కళాశాలల యాజమాన్యాలు ఆందోళన నిర్వహించాయి. అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా సుందర్‌రాజ్ యాదవ్ మాట్లాడుతూ.. రీయింబర్స్‌మెంట్ విడుదల విషయంలో సర్కార్ జాప్యం చేస్తుండడంతో యాజమాన్యాలు అధ్యాపకుల జీతాలు, భవనాల అద్దెలు, కరెంటు బిల్లులు, యూనివర్సిటీ రుసుం, బిల్డింగ్ టాక్స్ చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మద్దతుతో గద్దెనెక్కిన ప్రభుత్వం వారి అభ్యున్నతిపై నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం మొండి వైఖరి వీడి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ కాలేజీల అసోసియేషన్ ట్రెజరర్ వేణుమాధవ్, సంజీవ్‌రెడ్డి, నారాయణ రెడ్డి, కృష్ణమోహన్, హరేందర్ రెడ్డి, శ్రీనివాస్, డిగ్రీ, పీజీ కాలేజీల యజమానులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


