మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడి
ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని విద్యార్థుల డిమాండ్
హన్మకొండ: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులు చేపట్టిన మంత్రి ఇంటి ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. గురువారం హనుమకొండ రాంనగర్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడికి విద్యార్థులు యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు మంత్రి ఇంటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి బలగాలను మోహరించారు. ర్యా లీగా వచ్చిన విద్యార్థులను మంత్రి సురేఖ ఇంటి సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. విద్యార్థులు మంత్రి ఇంటి సమీపంలో బైఠాయించి నిరసన తెలిపారు. ఏఐఎస్‌ఎఫ్ నాయకులను అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిరసన తెలిపిన వారిలో ఆ విద్యార్థి సంఘం హనుమకొండ జిల్లా కార్యదర్శి బాషబోయిన సంతోశ్, వరంగల్ జిల్లా కార్యదర్శి ల్యాదల్ల శరత్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఒట్కూరి ప్రణీత్‌గౌడ్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు దిడ్డి పార్థసారథి, నాయకులు కుక్కల కుమార్, జక్కుల భానుప్రసాద్, బొజ్జు జ్యోతి, సీపతి వినయ్, చరణ్ గౌడ్, రాజు, రమేశ్, రమ్య, సృజన, సౌమ్య పాల్గొన్నారు.


