పక్కాగా పంటల సర్వే
హన్మకొండ: పంట నష్టంలో పారదర్శకత, కచ్చితత్వం కోసం ప్రభుత్వం డిజిటల్ సర్వే చేపట్టింది. ఏఈఓలు క్షేత్రస్థాయికి వెళ్లి పంట నష్టాన్ని ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. మోంథా తుపానుతో చేతికొచ్చిన పంటలు వర్షార్పణమయ్యాయి. పత్తి రైతులు కొంత మేరకు పత్తి ఇప్పటికే సేకరించారు. మొక్కజొన్న అధిక శాతం కోత పూర్తి అయింది. వర్షం, ఈదురు గాలులతో వరి పంట నేలవాలింది. దీంతో ధాన్యం గింజలు మొలకెత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
2,38,469.19 ఎకరాల్లో పంటల సాగు..
జిల్లాలో వానాకాలంలో అన్ని పంటలు కలిపి 2,38,469.19 ఎకరాల్లో సాగు చేశారు. ఇందులో వరి 1,46,990.34 ఎకరాలు, మొక్కజొన్న 4,669.35, పత్తి 85,708, నూనె గింజలు 124.13, పప్పు దినుసులు 818.25, ఇతర పంటలు 159.08 ఎకరాలు సాగు చేశారు. మోంథా తుపానుతో వరి 33,348 ఎకరాలు, పత్తి 750 ఎకరాలు, మొక్కజొన్న 620 ఎకరాల్లో నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేశారు. పూర్తిస్థాయి నష్టం అంచనా కోసం వ్యవసాయశాఖ క్షేత్ర స్థాయిలో డిజిటల్ సర్వే చేస్తోంది. కచ్చితత్వంతో కూడిన నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక యాప్ రూపొందించింది. రైతు భరోసా యాప్‌కు డిజిటల్ క్రాప్ సర్వేను జోడించి.. ఈ రెండు యాప్‌లలోని వివరాలు ఒకే యాప్‌లో కనిపించేలా రూపొందించారు. జిల్లాలోని 14 మండలాల్లో 14 మంది వ్యవసాయాధికారులు, 55 క్లస్టర్లలో 55 మంది ఏఈఓలు పంట నష్టాన్ని సర్వే చేస్తున్నారు. జిల్లా వ్యవసాయాధికారి రవీందర్‌సింగ్, ఏడీఓ ఆదిరెడ్డి సర్వేను పర్యవేక్షిస్తున్నారు.
కౌలు రైతులకు ప్రత్యేక యాప్..
పట్టాదారు పాస్‌పుస్తకం లేని రైతులు, రైతు భరోసా అందని రైతులు, కౌలు రైతుల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసేలా యాప్‌ను రూపొందించారు. అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకం లేని రైతులు, రైతు భరోసా అందని రైతుల వివరాలను ఆధార్ నంబర్ ద్వారా నమోదు చేస్తున్నారు.
పూర్తిస్థాయిలో పనిచేయని యాప్..
కొన్ని మొబైల్ ఫోన్లలో యాప్ సపోర్టు చేయడం లేదని, యాప్ ఇన్‌స్టాల్ అయినా నమోదు సమయంలో సమస్యలు వస్తున్నాయని పంట నష్టం సర్వే అధికారులు తెలిపారు. యాప్ పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో వివరాల నమోదులో జాప్యం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రత్యేక యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్న వ్యవసాయ అధికారులు
వరి 33,348 ఎకరాలు, పత్తి 750, మొక్కజొన్న 620 ఎకరాల్లో నష్టం
క్షేత్రస్థాయిలో 14 మంది ఏఓలు,
55 మంది ఏఈఓలు సర్వేలో నిమగ్నం


