సురక్షిత పాఠశాల 5.O
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లో పరిసరాలు శుభ్రంగా ఉండేలా.. ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకుగాను ‘పరిశుభ్రమైన, సురక్షిత పాఠశాల 5.0’ అనే కార్యక్రమాన్ని ఈనెల 25 వరకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష నిర్ణయించింది. ఇందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లా పరిధి హనుమకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాలో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు.
శిథిల భవనాలు కూల్చేయాలి..
ప్రభుత్వ పాఠశాలల ఆవరణలోని అన్ని తరగతి గదులను పరిశీలించి అందులో నిరుపయోగమైన, శిథిలావస్థకు చేరిన గదులను సంబంధిత ఉన్నతాధికారుల అనుమతితో ఈ నెల 17వరకు కూల్చేయాలి. 25 వరకు మైనర్ రిపేర్లు చేయాలి.. డిసెంబర్ 5 వరకు రంగులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఉపయోగం లేని వస్తువులు తొలగించాలి..
అన్ని తరగతి గదుల్లో, స్టోర్ రూమ్స్ ఆవరణలో పరిశీలించి పాఠశాల స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి వారి అనుమతితో ఉపయోగం లేని వస్తువులను తీసేయాలి. విరిగిన ఫర్నిచర్, పనికిరాని విద్యుత్ సామగ్రి, పాత పుస్తకాలు, పేపర్లు, మిగిలిని ప్లాస్టిక్ వస్తువులు, ఉపయోగం లేని టీఎల్‌ఎంలు కూడా తీసివేయాల్సి ఉంటుంది.
పాఠశాల ఆవరణలో శుభ్రత..
పెరిగిన చెట్ల కొమ్మలు, రాలిన ఆకులు, పిట్టగూళ్లను తొలగించాలి. నీరు నిల్వకుండా చూడడం, మురుగు నీరు లేకుండా.. దోమలు పెరగకుండా చర్యలు, నీటి లీకేజీలను అరికట్టాలి. తరగతి గది గోడలు శుభ్రంగా ఉండడం, కిటికీలు, ప్రవేశ ద్వారాల్లో దుమ్ము లేకుండా చేయాల్సి ఉంటుంది. మురుగునీరు వెళ్లేలా, మూత్రశాలలు, మరుగుదొడ్లు ప్రతీరోజు శుభ్రం చేయించాలి. వంటగది పరిసరాల్లో శుభ్రంగా ఉండేలా, హెల్త్ అండ్ హైజెనిక్ విద్యార్థులకు తరచూ మెడికల్ చెకప్ చేయించాలి. రోజువారీగా ఏయే పనులు చేయాలనే ప్రణాళికలను కూడా సంబంధిత విద్యాశాఖ ఉన్నతాధికారులు డీఈఓలను ఆదేశించారు. జిల్లాల్లోని మండల విద్యాఽశాఖ అధికారి, ప్రధానోపాధ్యాయులు, అసిస్టెంట్ ఇంజనీర్లతో కూడిన పాఠశాల కమిటీలు ఏర్పాటు చేయాలి. తరగతి గదులు, గ్రంథాలయాలు, ప్రయోగశాల, ఆటస్థలాన్ని పరిశీలించి విరిగిపోయిన, ఉపయోగం లేని వస్తువుల జాబితాను రూపొందించుకోవాల్సి ఉంటుంది.
శుభ్రత కార్యక్రమం అమలు
ప్రభుత్వ పాఠశాలల్లో సురక్షిత, పరిశుభ్రత కార్యక్రమం 5. అమలు చేయాలని ఎంఈఓలు, హెచ్‌ఎంలను ఆదేశించాం. పాఠశాలల్లో పరిశుభ్రత పరంగా తీసుకోవాల్సిన చర్యలను రోజువారీ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలి.
– వెంకటరెడ్డి, ఇన్‌చార్జ్ డీఈఓ, హనుమకొండ
ఆవరణల్లో శుభ్రమైన వాతావరణం
శిథిల భవనాలను తొలగించాలి
స్కూళ్లలో స్క్రాప్‌ను తీసివేయాల్సిందే..


