వైభవంగా జ్వాలాతోరణం
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో బుధవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జ్వాలాతోరణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం నుంచి అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించి భద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి 7 గంటలకు వరంగల్ మేయర్ గుండు సుధారాణి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా మేయర్ సుధారాణి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్వాలాతోరణాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని జ్వాలాతోరణాన్ని దర్శించుకున్నారు. అనంతరం దీపోత్సవాన్ని ప్రారంభించి మహిళలకు వాయినాలు అందించారు. ఆలయ ఈఓ రామల సునీత పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అల్లుడు విష్ణువర్ధన్, దేవాలయ ధర్మకర్తలు వీరన్న, శ్రవణ్‌కుమార్‌రెడ్డి, పూర్ణచందర్, శ్రీనివాసరావు, రాములు, శ్రీలక్ష్మీశ్రీనివాస సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.


