పేదల బియ్యం.. వరద పాలు
హన్మకొండ అర్బన్ : హనుమకొండ అంబేడ్కర్ భవన్ సమీపంలో గల పౌరసరఫరాల శాఖ బి య్యం నిల్వ చేసే గోదాం ఇటీవల తుపాను ప్రభా వంతో వరద తాకిడికి గురైంది. దీంతో గోదాంలోని బస్తాలన్నీ పూర్తిగా తడిసిపోయి పేదల బియ్యం పనికి రాకుండా పోయాయి. ప్రస్తుతం ఈ బియ్యం ఏం చేయాలని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వర్షాలకు తడిసిన బియ్యం సుమారు 500 క్వింటాళ్ల వరకు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. విపత్తుతో సంభవించిన ఈ నష్టానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు మంగళవారం గోదాంను సందర్శించారు. పరిస్థితిని సమీక్షించి అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. ఇన్సూరెన్స్ సంస్థలు సానుకూలంగా స్పందించి క్లెయిమ్ ఇచ్చినట్లయితే సరే.. లేదంటే ఈ నష్టం ప్రభుత్వం భరించాల్సిందే.
ఎందుకు మారట్లేదు..
కొన్నేళ్లుగా అంబేడ్కర్ భవన్ వద్ద ఉన్న ఎంఎల్‌ఎస్ పాయింట్ నిర్వహణ అధ్వానంగా తయారైంది. కూలిన గోడలు.. చినుకు పడితే చిత్తడిగా మారే పరిసరాలు, చెత్తాచెదారంతో ఆవరణ మొత్తం నిండి ఉంటుంది.. కొద్దిపాటి వర్షానికే ఇక్కడ బురదమయమవుతోంది. అయినా నష్ట నివారణ చర్యలు తీసుకోవడం, అక్కడి నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్ తరలించే విషయంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
దొడ్డు బియ్యమా.. సన్నబియ్యమా...
తడిసిన బియ్యంలో సుమారు 1,000 బస్తాల వరకు ఉన్నాయి. వీటిలో చాలావరకు సన్నబియ్యం తడిసినట్లు సమాచారం. అధికారులు మాత్రం ఇవన్నీ గత ఏప్రిల్ కంటే ముందు దొడ్డు బియ్యం ఇచ్చిన రోజుల్లో మిగిలినవి అని చెబుతున్నారు. జిల్లాలోని రేషన్ షాపుల్లో మిగిలిన దొడ్డు బియ్యం ఏప్రిల్ నుంచి అలాగే మూలుగుతున్నాయి. దొడ్డు బియ్యం కనీసం ఏదో ఒక ధర నిర్ణయించి అమ్ముకోమని రేషన్ డీలర్లకు చెప్పినా ఈపాటికి ఆ పని పూర్తయ్యేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
హమాలీలతోనే హడల్..?
ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో ఒక్కో పాయింట్ వద్ద సుమారు 50 మంది హమాలీలు ఉంటారు. ఇక్కడ ఏం చేయాలన్నా వీరిదే పెత్తనం. బియ్యం తడవకుండా తీయాలన్నా.. కేంద్రాన్ని అక్కడినుంచి తరలించాలన్నా వీరిపైనే అధికారులు ఆధారపడుతున్నారు. ఈ ఆనవాయితీ చాలాకాలంగా కొనసాగుతోందనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయంపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోకపోతే రానున్న కాలంలో మరింత నష్టం భరించక తప్పదని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎంఎల్‌ఎస్ పాయింట్ వద్ద
తడిసిన బియ్యం బస్తాలు
అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు..
అక్కడ హమాలీలదే పెత్తనం
పేదల బియ్యం.. వరద పాలు


