 
															మాటలే.. చేతల్లేవు
హన్మకొండ: సీఎం రేవంత్ మాటల్లో ఉన్న వాగ్ధాటి చేతల్లో లేదని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నమ్మించడం రేవంత్ నైజమని, వంచించడం, ద్రోహం చేయడం ఆయన రక్తంలో ఉందని తూర్పారబట్టారు. ఆరు గ్యారంటీల పేరుతో ద్రోహం చేసిన చరిత్ర దేశంలోని ఏ రాష్ట్రంలో లేదని విమర్శించారు. దేవునివి కానప్పడు ఎందుకు హామీలు గుప్పించావని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మరోసారి హామీలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. హాలీవుడ్ సినిమాలు ఇక్కడ తీయాలని సీఎం రేవంత్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హైడ్రాను తీసుకొచ్చి హైదరాబాద్ పరువు తీశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏదో ఒక గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులు అస్వస్థతకు గురవుతూ ఆస్పత్రిలో చేరుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సీఎంపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, బీఆర్‌ఎస్ నాయకులు దాస్యం విజయ్‌భాస్కర్, చింతం సదానందం, పులి రజినీకాంత్, శోభన్, సోదా కిరణ్, జోరిక రమేశ్, పోలెపల్లి రామ్మూర్తి, బుద్దె వెంకన్న, బొంగు అశోక్ యాదవ్, బండి రజినీ కుమార్, రాజు, చాగంటి రమేశ్, వీరు పాల్గొన్నారు.
వంచించడం
సీఎం రేవంత్ రక్తంలో ఉంది
శాసన మండలి ప్రతిపక్ష నేత
సిరికొండ మధుసూదనాచారి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
