
సీతంపేటలో ‘దీపావళి’ బతుకమ్మ
హసన్‌పర్తి: తెలంగాణ వ్యాప్తంగా దసరా ఉత్సవాలను పురస్కరించుకుని బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తే.. సీతంపేటలో మాత్రం దీపావళి సందర్భంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ గ్రామానికి చెందిన నేతకాని కులస్తులకు మాత్రమే ఈ వేడుకలు ప్రత్యేకం. మూడు రోజులపాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. రెండు వందల ఏళ్ల నుంచి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నేతకాని కులస్తులు పేర్కొన్నారు. గతంలో ఐదు రోజులపాటు కొనసాగిన ఈ ఉత్సవాలను మూడు రోజులకు కుదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న నేతకాని కులస్తులు ప్రతీ దీపావళికి సీతంపేటకు వచ్చి ఉత్సవాల్లో పాల్గొంటారు. కోలాటాల మధ్య ఉత్సవాలు కొనసాగనున్నాయి.
తొలిరోజు దేవతామూర్తుల ప్రతిమలు..
దీపావళి బతుకమ్మ వేడుక సందర్భంగా తొలి రోజు మంగళవారం చెరువు నుంచి మట్టిని తీసుకొచ్చి దేవతల ప్రతిమలను(ఎద్దులు) తయారు చేస్తారు. ఆ ప్రతిమలను ప్రత్యేక గదిలో ప్రతిష్ఠించి నైవేద్యాలు సమర్పిస్తారు. అనంతరం విశేష పూజలు నిర్వహిస్తారు.
రెండో రోజు పురుషుల ఉపవాస దీక్షలు
రెండో రోజు బుధవారం పురుషులు ఉపవాస దీక్ష చేపడుతారు.అనంతరం సాయంత్రం ఇళ్లల్లో ప్రతిష్ఠించిన దేవతా మూర్తుల ప్రతిమలను భారీ ప్రదర్శనగా తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేస్తారు. అనంతరం చెరువు వద్ద ఉపవాస దీక్ష విరమిస్తారు. ఆతర్వాత చెరువు నుంచి జలం తీసుకొచ్చి ప్రత్యేక గదిలో పెట్టి పూజలు చేస్తారు.
చివరి రోజుల బతుకమ్మ వేడుకలు
మూడో రోజు గురువారం మహిళలు గౌరమ్మ(బతుకమ్మ)లను తయారుచేసి భారీ ప్రదర్శనగా బయలుదేరుతారు. మహిళలతో పాటు పురుషులు కూడా బతుకమ్మలు ఎత్తుకుని ముందుకు సాగడం ప్రత్యేకత.
రేపటి నుంచి వేడుకలు ప్రారంభం
మూడు రోజులపాటు సంబురాలు