
పర్యావరణహిత ‘దీపావళి’ని ఆహ్వానించాలి
మహబూబాబాద్ రూరల్: చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా జరుపుకునే పండుగ దీపావళి. ఈ పండుగ పరామర్థం మానవ జీవితంలో ఆనందాలను నింపడమే.. అందుకే ఈ రోజున బాణసంచా పేల్చుతాం. అయితే దీపావళి వేడుకలను శబ్దకాలుష్యం లేకుండా దీపోత్సవంగా జరుపుకోవాలి. బాణసంచా కాల్చడం వల్ల బీపీ, తలనొప్పి, గుండెపోటు తదితర వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుందని చెప్పొచ్చు. కాలుష్య పొగను పీల్చితే ముక్కు, గొంతులో మంటలు ఏర్పడుతాయి. బాణసంచా పొగ కళ్లను మండించి నీరు తెప్పించడమేకాకుండా ఎరుపు రంగులోకి మారుస్తాయి. చెవులు ఒక్కోసారి పనిచేయడం మానేస్తాయి. అంతేకాకుండా చెవుడుకూడా వచ్చేప్రమాదం ఉంది. బాణసంచా కాలిస్తే అధిక రక్తపోటు, ఊపిరితిత్తుల వ్యాధులు, దగ్గు, తుమ్ములు, అస్తమా, ఉబ్బసం, అధికమవుతాయి. శ్వాస కష్టమవుతుంది. విషవాయువులు గర్భిణులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మానసికంగా సరిలేని వారు కూడా ఈ పండుగ రోజుల్లో భయం, ఒత్తిడికి గురవుతారు. భారీ ధ్వని కాలుష్యానికి వయసు పైబడిన వారు మరింత బాధపడుతారు. అందుకే ప్రతీ ఒక్కరూ పర్యావరణహిత ‘దీపావళి’ని జరుపుకోవాలని ఆశిద్దాం.