
20న లక్ష్మీ పూజలు, 21న నోములు
హన్మకొండ కల్చరల్: ఈనెల 20న (సోమవారం) ఉదయం మంగళ హారతులిచ్చి, సాయంత్రం ధనలక్ష్మి పూజలు నిర్వహించి దీపావళి పండుగను జరుపుకోవాలని, 21న మంగళవారం కేదారేశ్వర నోములు నిర్వహించుకోవాలని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ, వేయిస్తంభాల ఆలయ అర్చకుడు గంగు మణికంఠ అవధాని, వరంగల్ రాజరాజేశ్వరీదేవి దేవాలయం అర్చకుడు ఎల్లంభట్ల లక్ష్మణశర్మ, ఎల్కతుర్తి మండలం వల్లభాపూర్ గ్రామం శ్రీపశుపతినాథ్ దేవాలయ అర్చకుడు సదానీరంజన్ సిద్ధాంతి వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. అక్టోబర్ 21వ తేదీ మంగళవారం రోజున సూర్యోదయ సమయానికి ఉన్న అమావాస్య తిథిని ప్రామాణికంగా తీసుకుని కేదారేశ్వర వ్రతాలు నిర్వహించుకోవచ్చని బుధవారం (అక్టోబర్ 22)న నోము ఎత్తుకోవచ్చని తెలిపారు. ఈ సంవత్సరం స్వాతి నక్షత్రం లేని కారణంగా కొత్త నోములు చేపట్టవద్దని, పడిపోయిన నోములు చేయరాదని వివరించారు.
హన్మకొండ: విద్యుత్ వినియోగదారుల సమస్యలు తెలుసుకునేందుకు ఈనెల 17 ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ ఎస్‌ఈ పి.మధుసూదన్‌రావు తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే ఈకార్యక్రమంలో హనుమకొండ జిల్లా వినియోగదారులు 87124 84506 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు వివరించాలని, సలహాలు, సూచనలు అందించాలని కోరారు.
వరంగల్ సర్కిల్ ఎస్‌ఈతో..
విద్యుత్ వినియోగదారులకు మరింత నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాలో భాగంగా సమస్యలు, సలహాలు తెలుసుకునేందుకు ఈనెల 17న ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ ఎస్‌ఈ కె.గౌతంరెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా వినియోగదారులు శుక్రవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు నిర్వహించే ఈకార్యక్రమంలో 87124 84818 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు తెలపాలని, సలహాలు, సూచనలు అందించాలని కోరారు.
కేయూ క్యాంపస్: వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–26ను నిర్వహించేందుకు కేయూలోని కో–ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల ఎంపికై ంది. ఇందులో పాల్గొనాలనుకునే విద్యార్థులు తమ పేర్లను ‘మై భారత్ పోర్టల్’లో నమోదు చేసుకోవాలని ఆ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.రమణ గురువారం తెలిపారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్‌ను జిల్లాలో నిర్వహించేందుకు కేయూ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ రమణ, హనుమకొండలోని నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేశ్ చింతల, కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో కేయూ ఎన్‌ఎస్‌ఎస్ కో–ఆర్డినేటర్ ఆచార్య ఈసం నారాయణ, ఇంజనీరింగ్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ శైలజ, ఎం. సౌజన్య పాల్గొన్నారు.
అక్టోబర్ 20 నుంచి 10 సర్వీసులు
కాజీపేట రూరల్: దీపావళి పండుగను పురస్కరించుకుని దర్బాంగా–యశ్వంత్‌పూర్ మధ్య 10 ప్రత్యేక రైళ్ల సర్వీసులను నడిపిస్తున్నట్లు గురువారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ ఎ.శ్రీధర్ తెలిపారు. కాజీపేట జంక్షన్ మీదుగా నడిచే ఈ రైళ్లు ఈ నెల 20వ తేదీ నుంచి నవంబర్ 11 వరకు ప్రతీ సోమవారం దర్బాంగా–యశ్వంత్‌పూర్ (05541) వెళ్లే ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వెళ్తుంది. అదేవిధంగా అక్టోబర్ 23వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు యశ్వంత్‌పూర్–దర్బాంగా (05542) వెళ్లే ఎక్స్‌ప్రెస్ ప్రతీ బుధవారం కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వెళ్తుంది. 3–ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్, సెకెండ్ క్లాస్ కోచ్‌లతో ప్రయాణించే ఈ రైళ్ల సర్వీసులకు అప్ అండ్ డౌన్ రూట్‌లో సమస్థిపూర్, ముఝఫర్‌పూర్, హాజీపూర్, సోనాపూర్, చాప్రా, గ్రామీణ్, సివన్, డోరియోసాదర్, గోరఖ్‌పూర్, గోండా, బారబంకి, అశీశ్‌బాగ్, కాన్‌పూర్‌సెంట్రల్, ఓరియా, వీజీఎల్ ఝాన్సీ, బీనా, బోఫాల్, ఇటార్సీ, జోద్‌పూర్, కాబిన్, ఆమ్లా, నాగ్‌పూర్, చంద్రాపూర్, బల్లార్షా, రామగుండం, కాజీపేట జంక్షన్, కాచిగూడ, మహబూబ్‌నగర్, దోనే, ధర్మవరం, హిందుపూర్, ఎలహంకా స్టేషన్‌లో హాల్టింగ్ కల్పించారు.