
‘విజిలెన్స్’లో అక్రమార్కుడు
వరంగల్ క్రైం: ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతిని ఎండగట్టి.. అక్రమార్కులపై చర్యలకు సిఫార్సు చేసే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఓ అక్రమార్కుడు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా నడుస్తోంది. విజిలెన్స్‌లో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారికి నమ్మిన బంటైన సదరు కానిస్టేబు ల్‌ను ఏరి కోరి డిప్యుటేషన్‌పై తెచ్చుకున్నారు. ఇంకేముంది వసూళ్లకు పెట్టింది పేరైన సదరు కానిస్టేబుల్ పేరు చెబితే డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులకు కూడా చెమటలు పడుతున్నాయి! ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు విచారణలు, తనిఖీలకు ప్రాధాన్యం ఉన్న విజిలెన్స్‌లో ఈ అక్రమార్కుడి సంపాదన మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఇసుక క్వారీలు, రైస్ మిల్లులు, గ్రానైట్ క్వారీలు, ఫర్టిలైజర్స్, ఇలా ఎక్కడ చూసినా తన చేతికి పనిచెబుతున్నట్లు ఆరోపణలున్నాయి.
ఎంత చెబితే అంత!
విజిలెన్స్‌లో ఉద్యోగం కానిస్టేబులే అయినప్పటికీ పెత్తనం మాత్రం అంతా ఇంతా కాదు. ఆ శాఖలో పనిచేస్తున్న పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఇతగాడి నోటి నుంచి ఏం వస్తుందో.. దాని వల్ల వారికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో.. అనే భయంతో వణికిపోతున్నట్లు సమాచారం. ఆ శాఖలో ఆయనకు పనికాదు కదా.. ఎదురు చెప్పే ధైర్యం కూడా ఎవరూ చేయడం లేదు. తనను ఏరి కోరి తెచ్చుకున్న బాస్‌కు అన్నీ తానై చేయడంతో మిగిత అధికారులంతా గప్‌చుప్‌గా ఉంటున్నారు. మట్టి, ఇసుక, గ్రానైట్ లారీలను పట్టాలన్నా.. వాటికి జరిమానాలు విధించాలన్న ఆయన కనసన్నల్లోనే జరగడం గమనార్హం. తనకు అనుకూలంగా ఉండే లారీల యాజమానులకు ముందస్తుగా తనిఖీల సమాచారాన్ని చేరవేసి.. దానికి కాసుల రూపంలో ప్రతిఫలాన్ని పొందడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎవరైనా విజిలెన్స్ కార్యాలయంలో అధికారులను కలవాలంటే ముందుగా ఇతగాడిని ప్రసన్నం చేసుకున్న తర్వాతే దర్శనం దొరుకుతుంది. పూర్వ వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎక్కడ చూసినా ఆ కానిస్టేబుల్ పేరే వినబడుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో సంబంధం లేకుండా ఎక్కడికై నా, ఎప్పుడైనా వెళ్లి ఆయన పనులు గుట్టు చప్పుడు కాకుండా చేసుకుపోతున్నట్లు తెలిసింది. నెలవారీ మామూళ్లను సైతం తనకు ఇష్టం వచ్చినట్లు పెంచి.. ఇవ్వని క్వారీల, లారీల యాజమానుల వెంట పడుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈతతంగమంతా విజిలెన్స్ బాస్ కనుసన్నల్లో జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వసూళ్లలో దిట్ట
పేరుకే కానిస్టేబుల్.. పెత్తనం పెద్దది
లీకులకు పెట్టింది పేరు
అక్కడ ఆయనే బాస్