
మంగళవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
సాక్షిప్రతినిధి, వరంగల్ :
2025–27 సంవత్సరానికిగాను వైన్‌షాపు(ఏ–4)ల టెండర్ల దరఖాస్తుల ప్రక్రియ వేగం పుంజుకోవడం లేదు. దరఖాస్తు గడువు నేటి(మంగళవారం)తో మరో ఐదు రోజులే ఉంది. మద్యనిషేధ, ఆబ్కారీశాఖ గత నెల 26న ఉమ్మడి వరంగల్‌లో 296 దుకాణాలకు టెండర్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు ఈ నెల 18న సాయంత్రంతో దరఖాస్తు గడువు ముగియనుంది. నోటిఫికేషన్ ఇచ్చి సుమారు 19 రోజులు గడిచినా.. సోమవారం నాటికి 296 మద్యం దుకాణాలకు దాఖలైన దరఖాస్తుల సంఖ్య 500 దాటలేదు. గతేడాదితో పోలిస్తే ఈసారి చాలా తక్కువని చెబుతున్న అధికారులు.. మరో ఐదు రోజులు గడువు ఉండడంతో వేచిచూసే ధోరణిలో ఉన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా..
వైన్‌షాపులకు ఈసారి దాఖలవుతున్న దరఖాస్తులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ కూడా లేని విధంగా తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. 2023–25 టెండర్ల సందర్భంగా ఉమ్మడి వరంగల్‌లో 15,926 దరఖాస్తులు రాగా, ఈసారి శనివారం నాటికి కేవలం 258 వచ్చాయి. హనుమకొండ (వరంగల్ అర్బన్) జిల్లాలో 89, వరంగల్ (వరంగల్ రూరల్)లో 49, జనగామలో 34, మహబూబాబాద్‌లో 57, భూపాలపల్లి, ములుగు కలిపి 29 అప్లికేషన్‌లే వేశారు. సోమవారం కొంత స్పందన కనిపించినా.. ఉమ్మడి జిల్లాలో 457కే పరిమితమయ్యాయి. ఇందులో సోమవారం ఒక్కరోజే రాత్రి 8 గంటల వరకు 199 రాగా, హనుమకొండ జిల్లాలో 63, వరంగల్‌లో 46, జనగామలో 25, మహబూబాబాద్‌లో 56, భూపాలపల్లిలో 9 దరఖాస్తులు వచ్చినట్లు ఆబ్కారీశాఖ అధికారులు తెలిపారు. కాగా గతంలో ఎప్పుడు ఇలా జరగలేదని, దరఖాస్తుల ద్వారానే కేవలం రూ.318.52 కోట్ల ఆదాయం వచ్చిందన్న చర్చ ఉంది. రూ.2 లక్షలున్న దరఖాస్తు ధర ఈసారి రూ.3 లక్షలకు పెంచగా.. పోటీ కూడా గతేడాది మాదిరిగానే ఉండి అప్లికేషన్ల ఆదాయం రెట్టింపవుతుందని భావించారు. అందుకు భిన్నంగా దరఖాస్తులు తగ్గడం.. ఆబ్కారీశాఖను సైతం షాక్‌కు గురిచేస్తోంది.
వ్యాపారుల వ్యూహం ఏంటి?
వైన్‌షాపుల టెండర్ల విషయంలో మద్యం వ్యాపారుల వైఖరి ఏంటనేది అర్థం కావడం లేదు. ఇప్పటికే మద్యం ‘సిండికేట్’లనుంచి వందల సంఖ్యలో దరఖాస్తులు పడాల్సి ఉన్నా చడీచప్పుడు లేదు. వరంగల్‌కు చెందిన కొంతమంది వ్యాపారులు సిండికేట్‌గా మారి వందల సంఖ్యలో దరఖాస్తులు వేశారు. ఒక గ్రూపు రూ.14 కోట్లు వెచ్చించి 700 దరఖాస్తులు వేస్తే.. మరో గ్రూపు 650 దరఖాస్తులకు రూ.13 కోట్లు వెచ్చించింది. గతేడాది రూ.12 కోట్లు వెచ్చించి 600 దరఖాస్తులు వేసిన జనగామకు చెందిన ఓ సిండికేట్ గ్రూపు ఈసారి ఇప్పటి వరకు స్పందించలేదని తెలిసింది. ఇలా మహబూబాబాద్, భూపాలపల్లితో పాటు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని మద్యం వ్యాపారులు పలువురు ఇంకా దరఖాస్తులు వేయలేదు. దీంతో వారి వైఖరి ఏంటన్న చర్చ జరుగుతోంది. నోటిఫికేషన్ ఇచ్చి 18 రోజులు గడిచినా టెండర్లకు స్పందన లేకపోవడంతో మద్యనిషేధ, ఆబ్కారీశాఖ అధికారులు సైతం ప్రస్తుతం షాపులు నడుపుతున్న వారికి, మద్యం వ్యాపారులకు ఫోన్లు చేస్తున్నారు. 2023–25 వైన్‌షాపుల టెండర్లకు అనూహ్య స్పందన లభించింది. అప్పుడప్పుడే రియల్ ఎస్టేట్ దెబ్బతింటున్న నేపథ్యంలో రియల్‌ఎస్టేట్, ఫైనాన్స్, కాంట్రాక్ట్ రంగంలో పలువురు మద్యం దందావైపు చూశారు. ఈ దందా కొందరికీ అనుకూలించగా, మరికొందరిని నిండా ముంచేసిందన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలోనే గతేడాది మద్యం వ్యాపారంలోకి అడుగుపెట్టిన చాలా మంది ఈసారి దూరంగా ఉండడం వల్ల దరఖాస్తులు తగ్గినట్లుగా చెబుతున్నారు. అయితే ఆబ్కారీశాఖ అధికారులు మాత్రం మరో ఐదు రోజులు గడువు ఉండడంతో వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ఈ నాలుగైదు రోజుల్లోనే కచ్చితంగా పెద్ద సంఖ్యలోనే దరఖాస్తులు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం రాత్రి వరకు వచ్చిన దరఖాస్తులు ఇలా..
మద్యం టెండర్లకు మందకొడిగా దరఖాస్తులు
296 వైన్‌షాపులకు
500లు కూడా దాటని వైనం
మిగిలింది ఇంకా ఐదు రోజులే..
గతేడాది 15,928 దరఖాస్తులు..
రూ.318.52 కోట్ల ఆదాయం
రూ.3 లక్షలకు పెంచడంతో
ఈసారి ఆదాయం మరింత
పెరుగుతుందని అంచనా
ఆశించిన స్థాయిలో రాని
దరఖాస్తులు.. వ్యాపారుల
తీరుపై అనుమానం..
‘సిండికేట్’గా
టెండర్లకు ప్రయత్నం?
వేచిచూసే ధోరణిలో
ఎకై ్సజ్ అధికారులు

మంగళవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్ శ్రీ 2025