
వినతులు సత్వరమే పరిష్కరించాలి
కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో స్వీకరించిన వినతులు సత్వరమే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీలను ఆయా శాఖల అధికారులు జాప్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజవాణిలో జీడబ్ల్యూఎంసీ 16, పీడీ హౌసింగ్, ఆర్డీఓ హనుమకొండతో పాటు వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 80 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
వరంగల్ గ్రీవెన్స్‌లో 80 అర్జీలు..
న్యూశాయంపేట: అర్జీలను తక్షణమే పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రెవెన్యూ 40, జీడబ్ల్యూఎంసీ 6, హౌసింగ్ 4, డీఆర్డీఓ 4, మిగతా శాఖలకు సంబంధించి 26 (మొత్తం 80) దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. కాగా, వరంగల్ మట్టెవాడలోని సర్వేనంబర్ 442లోని ప్రభుత్వ భూమిని కొంతమంది అక్రమ నిర్మాణాలు చేపట్టారని, విచారణ చేపట్టి చర్య తీసుకోవాలని బి.రాజు అనే వ్యక్తి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, హౌసింగ్ పీడీ గణపతి, ఆర్డీఓ ఉమారాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

వినతులు సత్వరమే పరిష్కరించాలి