
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ఎంజీఎం: కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల పెండింగ్ వెతనాలు వెంటనే చెల్లించాలని, అక్రమ డిప్యుటేషన్లను రద్దు చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదానాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ఆస్పత్రి ఎదుట సిబ్బందితో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యాదానాయక్ మాట్లాడుతూ 6 నెలలుగా వేతనాలు రాకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. అనంతరం ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యకు వినతిపత్రాలు అందించారు. యూనియన్ జిల్లా కార్యదర్శి జె.సుధాకర్, ఆస్పత్రి సిబ్బంది శోభ, సంధ్య, భానురేఖ, విక్రం, కోమల, సంతోష్‌కుమార్, లావణ్య, మౌనిక, స్రవంతి, హిమబిందు, శ్రావణి పాల్గొన్నారు.
కేసు తారు మారు
● హైకోర్టును ఆశ్రయించిన బాధితుడు
● ఎస్సైతోపాటు ౖవైద్యులపై కేసు నమోదుకు ఆదేశం
హసన్‌పర్తి: ప్రత్యర్థులు దాడి చేస్తే గాయపడిన తనను రోడ్డు ప్రమాదానికి గురైనట్లు కేసు తారుమారు చేశారని బాధితుడు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో సదరు అధికారులపై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు ఎస్సై సాంబయ్యతోపాటు వైద్యులపై కేసు నమోదైనట్లు హనుమకొండ పోలీస్‌స్టేషన్ ఎస్సై సతీష్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌కు చెందిన ప్రశాంత్‌కుమార్ అనే యువకుడిపై 2022లో కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. సంఘటనస్థలాన్ని పరిశీలించిన అప్పటి ఎస్సై సాంబయ్యతోపాటు వైద్యులు కూడా తాను రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లు నివేదిక ఇచ్చారంటూ ప్రశాంత్‌కుమార్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో కేసును తారుమారు చేసిన ఎస్సై సాంబయ్యతోపాటు వైద్యసిబ్బందిపై కేసు నమోదు చేయాలని హైకోర్టు.. హనుమకొండ పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు ఎస్సైతోపాటు వైద్యులపై కేసు నమోదైంది.