
టీజీఎస్ ఆర్టీసీలో కొలువులు
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. డ్రైవర్లు, శ్రామిక్‌ల పోస్టులు భర్తీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులు భర్తీ చేయనున్నారు. గతంలో రీజియన్ మొత్తం ఒకే జిల్లాగా ఉండేది. ఈ క్రమంలో నూతన జిల్లాల వారీగా పోస్టులు భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ రీజియన్‌లోని 6 జిల్లాల్లో కలిపి మొత్తం 130 డ్రైవర్, 78 శ్రామిక్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈసారి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నియామక ప్రక్రియ పూర్తిచేసి ఎంపికై న ఆభ్యర్థుల జాబితాను ఆర్టీసీకి అందిస్తుంది.
●వరంగల్ రీజియన్‌లో మొత్తం 130 డ్రైవర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ములుగు జిల్లాలో–3, జయశంకర్ భూపాలపల్లి–5, వరంగల్‌లో–29, హనుమకొండలో 41, మహబూబాబాద్‌లో 31, జనగామ జిల్లాలో 21 పోస్టులు భర్తీ చేయనున్నారు. శ్రామిక్ పోస్టులు మొత్తం 78లో మెకానికల్–66, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ నాలుగు చొప్పున, పెయింటర్, వెల్డర్, కటింగ్ అండ్ అప్‌హోల్డర్, మిల్‌రైట్ మెకానిక్ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. శ్రామిక్ మెకానిక్ పోస్టులు ములుగు జిల్లాలో–2, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో–3, వరంగల్ జిల్లాలో–15, హనుమకొండలో–21, మహబూబాబాద్ జిల్లాలో 15, జనగామ జిల్లాలో 10, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ పోస్టులు ములుగు, భూపాలపల్లిలో జిల్లాలో ఏమీ లేవు, వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో ఒక్కో పోస్టు భర్తీ చేయనున్నారు. పెయింటర్ వరంగల్ జిల్లాలో ఒకటి, వెల్డర్ హనుమకొండలో ఒకటి, కటింగ్ అండ్ సీవింగ్ అప్‌హోల్‌స్టర్, మిల్‌రైట్ మెకానిక్ పోస్టులు ఒక్కొక్కటి భర్తీ చేయనున్నారు.
● అక్టోబర్ 8 నుంచి 28 వరకు www. trprb. in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. పే స్కేల్ డ్రైవర్‌కు రూ.20,960– రూ.60.080, శ్రామిక్‌కు రూ.16,550 – రూ.45,030. వయస్సు డ్రైవర్లకు 22 నుంచి 35 సంవత్సరాలు, శ్రామిక్‌లు 18 నుంచి 30 సంవత్సరాల మద్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 5 ఏళ్లు, మాజీ సైనికులకు మూడేళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపు ఇచ్చారు. దరఖాస్తు రుసుం డ్రైవర్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీలకు రూ.300, ఇతరులకు రూ.600. శ్రామిక్ పోస్టులు ఎస్సీ, ఎస్టీలకు రూ.200, ఇతరులకు రూ.400గా నిర్ణయించారు.
● శ్రామిక్ పోస్టులను ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తారు. మొత్త వంద మార్కుల్లో ఐటీఐలో ప్రతిభ ఆధారంగా 90 మార్కులు, నేషనల్ అప్రెంటిస్‌షిప్‌కు 10 మార్కులుంటాయి. ఓసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 50 శాతం, బీసీలకు 45 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు.
● డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 160 సెంటీమీటర్లకన్నా తక్కువ ఎత్తు ఉండొద్దు. మొత్తం 100 మార్కుల్లో డ్రైవింగ్ టెస్ట్‌కు 60, వెయిటేజీ కింద 40 మార్కులు ఇస్తారు. అభ్యర్థులు కనీస మార్కులు 60 సాధిస్తేనే అర్హత సాధిస్తారు. పదో తరగతి మార్కులు, డ్రైవింగ్ లైసెన్స్ రకం, సీనియారిటీ బట్టి వెయిటేజీ మార్కులు కేటాయిస్తారు. నోటిఫికేషన్ విడుదల నాటికి 18 నెలలకు తక్కువ కాకుండా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అభ్యర్థులు 1–7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు, అగ్రవర్ణ పేదలు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, బీసీలు నాన్ క్రిమిలేయర్ పత్రాలు దరఖాస్తుతోపాటు జతచేయాలి.
వరంగల్ రీజియన్‌లో 130 డ్రైవర్, 78 శ్రామిక్ పోస్టులు
నూతన జిల్లాల వారీగా
ఉద్యోగాల ప్రకటన