
మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి
అదనపు డీఆర్డీఓ వెంకటేశ్వర్లు
హసన్‌పర్తి: మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో మహిళా స్వయం సహాయక సంఘాలు పని చేయాలని హనుమకొండ అదనపు డీఆర్డీఓ బొజ్జ వెంకటేశ్వర్లు సూచించారు. హసన్‌పర్తిలోని సంస్కృతీ విహార్‌లో జిల్లా గ్రామీణ మహిళలకు ఎంటర్‌ప్రైజెస్‌పై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశానికి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పరిశ్రమల శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఔత్సాహిక మహిళలకు పరిశ్రమ నిర్వహణ ఉత్పత్తుల మార్కెటింగ్, మెలకువలు, నైపుణ్యాలపై 15 రోజుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో డీపీఎం రాజేంద్రప్రసాద్, ఏపీఏ ప్రభాకర్, అలీఫ్ సంస్థ సభ్యురాలు రమాదేవి, ప్రాజెక్ట్ ఆఫీసర్ మహ్మద్ ఖాసీం, క్యాంప్ కో–ఆర్డినేటర్ వంశీ పాల్గొన్నారు.