
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
కేయూ క్యాంపస్: తెలంగాణ ప్రజల సంస్కృతికి ప్రతీక బతుకమ్మ అని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రం అన్నారు. గురువారం వర్సిటీలోని కామర్స్ విభాగం, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లిష్ విభాగాల వద్ద విద్యార్థులు, మహిళా అధ్యాపకులు బతుకమ్మ సంబురాలు జరుపుకున్నారు. ఆయా విభాగాల మహిళా అధ్యాపకులు డాక్టర్ రమ, మేఘనరావు, పి.అమరవేణి, వరలక్ష్మి, ఎస్ జ్యోతి, మమత, సవితాజ్యోత్స్న, దీపాజ్యోతి, డాక్టర్ సౌజన్య, నీలిమ, ప్రగతి పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్, ఆచార్య నర్సింహాచారి అధ్యాపకులు పాల్గొన్నారు.
హన్మకొండ అర్బన్: తెలంగాణ ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 21, 22 తేదీల్లో నగరంలోని కాళోజీ కళాక్షేత్రంలో కాకతీయ నృత్య నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ నాట్య గురు, అకాడమీ అధ్యక్షురాలు డాక్టర్ అలేఖ్య పుంజాల తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ కూచిపూడి నృత్య రూపకం, ఓరుగల్లు చరిత్ర కాకతీయ వైభవం గుర్తు చేస్తూ రాణి రుద్రమ చారిత్రక నాటకం, ప్రజా సాహిత్య కళారూపాలు ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈనృత్య నాటకోత్సవాలను రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభిస్తారని వివరించారు. ఈవేడుకలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధనసరి సీతక్క, కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, ‘కుడా’ చైర్మన్ వెంకట్రామిరెడ్డి తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ తొలిసారి నిర్వహిస్తున్న కాకతీయ సాంస్కృతికోత్సవాలకు ప్రవేశం ఉచితమని, కళాభిమానులు పెద్ద ఎత్తున విచ్చేసి దిగ్విజయం చేయాలని కోరారు.
హన్మకొండ అర్బన్: జిల్లాలో ఇద్దరు తహసీల్దార్లకు స్థానచలనం కల్పిస్తూ హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కలెక్టరేట్‌లో సూపరిటెండెంట్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌కు శాయంపేట తహసీల్దార్‌గా డిప్యుటేషన్‌పై బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా అక్కడ పనిచేస్తున్న సత్యనారాయణను కలెక్టరేట్‌కు డిప్యుటేషన్‌పై పంపించారు. బదిలీల నిషేధంతో వేతనాల విషయంలో ఇబ్బందులు అవుతాయని, బదిలీల స్థానంలో డిప్యుటేషన్ పేరుతో తహసీల్దార్లకు స్థానచలనం కల్పించినట్లు సమాచారం.
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్‌లోని రైల్వే కమ్యూనిటీహాల్‌లో శనివారం ఆల్ ఇండియా గార్డ్స్ కౌన్సిల్ (ఏఐజీసీ) బీజీఎం సమావేశం నిర్వహించనున్నట్లు ఏఐజీసీ సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ కట్కూరి ప్రవీణ్ తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా గార్డ్స్ కౌన్సిల్ ఫార్మర్ జనరల్ సెక్రటరీ ఎస్పీ సింగ్, దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ జోనల్ అధ్యక్ష, కార్యదర్శులు అఖిలేశ్‌పాండే, రత్నేశ్‌కుమార్, సికింద్రాబాద్ డివిజనల్ ప్రెసిడెంట్లు, సెక్రటరీతోపాటు 200 మంది పాల్గొంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
‘శృంగేరి’కి భవన విరాళం
రామన్నపేట: వరంగల్ కాకతీయ సినిమా థియేటర్స్ కాంప్లెక్స్ వ్యవస్థాపకులు, ధార్మికవేత్తలు దివంగత సీతారామాంజనేయులు–స్వర్ణ కుమారి దంపతుల కోరిక మేరకు శ్రీనివాస కాలనీలోని కోట్ల రూపాయల విలువైన రెండంతస్తుల భవవాన్ని వారి కుటుంబ సభ్యులు వరంగల్ శ్రీ శృంగేరి శంకరమఠానికి విరాళంగా అందజేశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు శ్రీరామ్మూర్తి, విశ్వేశ్వర్‌రావు తదితరులు గురువారం కర్ణాటకలోని శ్రీ శృంగేరి శంకరమఠం సన్నిధానంలో పీఠాధిపతి విధుశేఖర భారతికి భవన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ శృంగేరి శంకర మఠం ప్రధాన అర్చకుడు సంగమేశ్వర జోషి, దాతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ