
అంత్యక్రియలకు వెళ్లొస్తూ అనంతలోకాలకు..
వర్ధన్నపేట: తమ బంధువు అంత్యక్రియలకు వెళ్లొస్తూ ఓ వృద్ధురాలు అనంతలోకాలకు చేరింది. బైక్‌ను ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో తల్లి దుర్మరణం చెందగా, కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన మున్సిపాలిటీ పరిధి వరంగల్–ఖమ్మం రహదారి డీసీ తండా వద్ద చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కమ్మనపల్లి తండా గ్రామానికి చెందిన గుగులోత్ రేశమ్మ(56) తన కుమారుడు తుకారంతో కలిసి గురువారం ఉదయం బైక్‌పై రాయపర్తి మండలం టీకే తండాలో జరిగిన తమ బంధువు అంత్యక్రియలకు హాజరయ్యారు. కార్యక్రమం పూర్తయిన అనంతరం అదేరోజు రాత్రి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వరంగల్– ఖమ్మం రహదారి డీసీ తండా వద్ద ఆయిల్ ట్యాంకర్ ఎదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో రేశమ్మ అక్కడికక్కడే దుర్మరణం చెందింది. కుమారుడు తుకారామ్‌కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఎంజీఎం తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని గేదెల కాపరి ..
మహబూబాబాద్ రూరల్ : ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ గేదెల కాపరి దుర్మరణం చెందగా మూడు గేదెలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకర మిల్ తండా వద్ద చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ కాలనీకి చెందిన రేఖ సోమయ్య మేనల్లుడు గంగుల వెంకన్న (42) గేదెలను మేత నిమిత్తం గురువారం ఉదయం మున్నేరువాగు సమీపంలోకి తీసుకెళ్లాడు. రాత్రి సమయంలో తీసుకుని వస్తుండగా నర్సంపేట డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు కంకరమిల్ తండా వద్ద గేదెలను వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ మూడు గేదెలు వచ్చి వెంకన్నపై పడగా అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని 108లో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన గేదెలకు వైద్య చికిత్స చేయిస్తున్నారు. అనంతరం మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బొలెరో ఢీకొని అయ్యగారిపల్లిలో రైతు..
కురవి: చేను వద్ద నుంచి నడుచుకుంటూ ఇంటికొస్తున్న ఓ రైతును బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ రైతు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మండలంలోని అయ్యగారిపల్లిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు పొన్నెబోయిన మధుసూదన్(48) చేను వద్ద పని ముగించుకుని పశువులను ఇంటికి తోలుకొస్తున్నాడు. ఈ క్రమంలో బొలెరో వాహనం మరిపెడ నుంచి కురవి వైపునకు వస్తూ మధుసూదన్‌ను ఢీకొంది. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడడంతో స్థానికులు వెంటనే మానుకోట లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. మధుసూదన్ మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.
బైక్‌ను ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్
తల్లి దుర్మరణం.. కుమారుడికి
తీవ్రగాయాలు
డీసీ తండా వద్ద ఘటన

అంత్యక్రియలకు వెళ్లొస్తూ అనంతలోకాలకు..

అంత్యక్రియలకు వెళ్లొస్తూ అనంతలోకాలకు..