గంజాయి రవాణాదారులకు పదేళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

గంజాయి రవాణాదారులకు పదేళ్ల జైలు

Sep 19 2025 1:36 AM | Updated on Sep 19 2025 1:36 AM

గంజాయి రవాణాదారులకు పదేళ్ల జైలు

గంజాయి రవాణాదారులకు పదేళ్ల జైలు

వరంగల్‌ లీగల్‌ : నలుగురు గంజాయి రవాణాదారులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున జరిమానా విధిస్తూ హనుమకొండ మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి కె.అపర్ణాదేవి గురువారం తీర్పు వెలువరించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బి.రాజమల్లారెడ్డి కథనం ప్రకారం.. హసన్‌పర్తి ఏఎస్సై ఉపేందర్‌రావు 2017, జనవరి 16న మల్లారెడ్డిపల్లి శివారులో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆ సమయంలో ఇద్దరు ద్విచక్రవాహనంపై వస్తూ పోలీసులను చూసి పారిపోవడానికి యత్నించగా పట్టుకున్నారు. అనంతరం తనిఖీ చేయగా బస్తాలో ఎండు గంజాయి లభించింది. వెంటనే విచారించగా ద్విచక్రవాహనంపై వచ్చిన వారు శాయంపేట మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన నారిగే రాజయ్య, గంగిరేనిగూడెం సూర్యానాయక్‌ తండాకు చెందిన లావుడ్య భద్రమ్మగా తెలిసింది. గ్రామస్తుడు దుప్పటి మల్లయ్యతో కలిసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మల్లారెడ్డిపల్లికి చెందిన రైతులు బొల్ల అయిలయ్య , దాసరి కుమారస్వామి నుంచి కిలో గంజాయి రూ.వెయ్యికి కొనుగోలు చేసి హైదరాబాద్‌, కదిరి, మహారాష్ట్రకు కిలో రూ.6,500 చొప్పున అమ్మడానికి రవాణా చేస్తున్నామని ఒప్పుకున్నారు. అలాగే, వీరికి కొద్ది దూరంలో మరో రెండు బస్తాల గంజాయితో దుప్పటి మల్ల య్య, బొల్ల అయిలయ్య, దాసరి కుమారస్వామి ఉన్నారని తెలిసింది. పోలీసుల రాకను గమనించిన ముగ్గురు పరారయ్యారు. అనంతరం నిందితులను పట్టుకుని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో నేరం రుజువుకావడంతో నలుగురు నేరస్తులు లావుడ్య భద్రమ్మ, దుప్పటి మల్లయ్య, బొల్ల అయిలయ్య, దాసరి కుమారస్వామికి 10 సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి అపర్ణాదేవి తీర్పు వెల్లడించారు. కాగా, విచారణ సమయంలోనే ప్రధాన ముద్దాయి నారిగే రాజయ్య మృతి చెందాడు. ఈ కేసును పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ చేరాలు, కిషన్‌ పరిశోధించగా లైజన్‌ ఆఫీసర్‌ పరమేశ్వరి విచారణ పర్యవేక్షించారు. సాక్షులను హెడ్‌ కానిస్టేబుల్‌ వి.రవీందర్‌ కోర్టులో ప్రవేశపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement