సాయుధ పోరాటంలో ఉమ్మడి జిల్లా కీలక భూమిక
నిజాం దొరలు, రజాకార్లను తరిమికొట్టిన వీరులు
ప్రాణ త్యాగాలతో స్వేచ్ఛావాయువులు
సెప్టెంబర్ 17 సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు
1947 ఆగస్టు15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. హైదరాబాద్ స్టేట్ నిజాం పాలనలో మగ్గుతూనే ఉంది. నిజాం నిరంకుశత్వంతో విసుగెత్తిన జనాలు తిరగబడ్డారు. రజాకార్లను తరిమి కొట్టారు. స్వేచ్ఛావాయువుకోసం పోరాడుతున్న నాటి హైదరాబాద్ స్టేట్ ప్రజలు.. దేశ తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో చేపట్టిన పోలీస్ చర్యతో 1948 సెప్టెంబర్ 17న భారత్‌లో భాగస్వామ్యమయ్యారు.
సాయుధ పోరులో డోర్నకల్
డోర్నకల్: మానుకోట జిల్లా డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీస, ఉయ్యాలవాడ, వెన్నారం, బూరుగుపాడు, తోడేళ్లగూడెం, చిలుకోడు తదితర గ్రామాల నుంచి అనేకమంది పోరులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి చెందిన తుమ్మ శేషయ్య, ఏలూరి వీరయ్య, నున్న పుల్లయ్య దళకమాండర్లు ఉండడంతో రజాకార్లు ఈ ప్రాంతంపై దృష్టి సారించారు. దళాల ఆచూకీ తెలపాలని 1948 సెప్టెంబర్ 1న 200 మంది రజాకార్ల ముఠా పెరుమాళ్ల సంకీసపై దాడి చేసింది. బందెల దొడ్డి వద్ద కాల్పులు జరపడంతో 16 మంది అక్కడికక్కడే.. గాయపడ్డ ఆరుగురు తర్వాత చనిపోయారు. అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల అనంతరం మృతదేహాలతోపాటు గాయాలైనవారిని తగులబెట్టారు. ఉయ్యాలవాడలో 1947 ఫిబ్రవరి 14న రజాకార్లు జరిపిన దాడిలో ఇద్దరు గ్రామస్తులు చనిపోయారు.
పోరాడినందుకు గర్వపడుతున్నా..
గార్ల: గీత కార్మికుడైన తోడేటి రామస్వామి, శాంతమ్మకు 1928లో జన్మించిన నేను భారత కమ్యూనిస్టు పార్టీలో పనిచేశా.‘నిజాం తొత్తు జాగీర్దార్ సైతం గార్లలో అజమాయిషీ చెలాయిస్తూ దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడేవాడు. రజాకార్లకు హెడ్‌గా మిస్కిల్‌సాబ్ వ్యవహరించేవాడు. జీవంజిపల్లిలో రజాకార్లకు రైఫిల్ ట్రైనింగ్ ఇచ్చేవాడు. రజాకార్లు పగలు గ్రామాల్లో ప్రదర్శన నిర్వహిస్తూ ‘జిన్నీకా హుకుం సే నెహ్రూకు జుకాదేంగే’ అంటూ నినాదాలు చేసేవారు. నాడు అందరూ ఉర్దూ మీడియం చదవాల్సిందే అంటూ హుకుం జారీచేశారు. జాగీర్దార్ వ్యవస్థలో తహసీల్దార్లుగా ఉన్న నూరుద్దీన్, రషీద్‌మియా అమానుష ఆగడాలకు అంతులేకుండా పోయింది. అప్పట్లో ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’.. అంటూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట శంఖాన్ని పూరించిన దాశరథి కృష్ణమాచారి, రంగాచారి స్ఫూర్తితో 18 సంవత్సరాల వయసులో నేను నాటి సామాజిక పరిస్థితులకు ప్రభావితుడనయ్యాను. రజాకార్లు, నైజాం పోలీసులు రాంపురంలో బాలింతను చెరచడంతోపాటు దుబ్బగూడెం, ముల్కనూరు గ్రామాల్లో విచక్షణారహితంగా దాడులు చేశారు. ప్రజలు చెట్టుకొకరు. పుట్టకొకరుగా ఇళ్లు వదిలి పెట్టాల్సిన పరిస్థితులు నన్ను కలిచివేసి ఉద్యమం వైపు నడిపించాయి. నాడు ఈ ప్రాంత ఉద్యమ కమాండర్‌గా పనిచేస్తున్న తుమ్మల శేషయ్య నాయకత్వంలో ముందుకు సాగాం. బండ్లకుంట వద్ద సేదతీర్చుకుంటున్న మా దళానికి రజాకార్లకు మధ్య 1948లో జరిగిన ఎదురు కాల్పుల్లో దామినేని వెంకటేశ్వరరావు, బుచ్చిమల్లు, మరికొంతమంది అమరులయ్యారు.