
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
● డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లింగారెడ్డి
విద్యారణ్యపురి: విద్యారంగం, టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు టి.లింగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండలోని డీటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్‌సీని అమలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఇటీవల జరిగిన టీచర్ల పదోన్నతుల్లో మిగిలిపోయిన పోస్టుల్లో అర్హులైన ఉపాధ్యాయులను వెంటనే భర్తీచేయాలని డిమాండ్ చేశారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలని, టీచర్ల శిక్షణ కార్యక్రమాలు వేసవి సెలవుల్లోనే ఇవ్వాలని, విద్యేతర ఆన్‌లైన్ కార్యక్రమాలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు డాక్టర్ ఎం. గంగాధర్ మాట్లాడుతూ ప్రభుత్వం కామన్ సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి ఉపాధ్యాయులకు డైట్ లెక్చరర్లుగా, ఎంఈఓలుగా, డిప్యూటీ డీఈఓ లుగా పదోన్నతి కల్పించాలని కోరారు. సమావేశంలో డీటీఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు జి.ఉప్పలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీని వాస్, బాధ్యులు బి.అంజనీదేవి, ఎస్.సుమ, డాక్టర్ కిషన్, ఎ.మల్లయ్య, డి.రమేశ్, టీచర్లు పాల్గొన్నారు.