
ఉత్తమ టీచర్ల ఎంపికలో పారదర్శకత ఏది?
విద్యారణ్యపురి : గతంలో ఎన్నడులేని విధంగా హనుమకొండ జిల్లాలో ఉత్తమ టీచర్ల ఎంపికపై విమర్శలు వెల్లువెత్తాయి. గురుపూజోత్సవం సందర్భంగా ఈనెల 4న మధ్యాహ్నం జిల్లాలో 48మందితో కూడిన ఎంపిక జాబితాను డీఈఓ ప్రకటించారు. ఎల్‌ఎఫ్‌హెచ్‌ఎంలు, ఎస్‌జీటీలకు తగిన విధంగా అవార్డుల్లో ఎంపిక చేయలేదనే ఆరోపణలు పలు ఉపాధ్యాయ సంఘాలు డీఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో అదేరోజు రాత్రి కొంతమంది టీచర్ల పేర్లను తొలగించి మరికొందరిని చేర్చి 40మందితో ఉపాధ్యాయుల జాబితాను రాత్రి 11గంటల సమయంలో ప్రెస్ గ్రూప్, ఉపాధ్యాయ సంఘాల గ్రూప్‌ల్లో పోస్టు చేశారు. దీంతో అయోమయం నెలకొంది. ఒకసారి అవార్డుకు ఎంపికై నట్లు ప్రకటించి తొలగించడం ఆయా టీచర్లకు ఇబ్బందికరంగా మారిందని ఇది సరికాదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు శుక్రవారం డీఈఓ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పీఆర్‌టీయూ సంఘం జిల్లా బాధ్యులు.. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారని తెలిసింది. దీంతో ఎమ్మెల్యే కూడా సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారని సమాచారం. దీంతో మొదటి జాబితా నుంచి తొలగించిన టీచర్ల పేర్లను యథావిధిగా నిర్ణయించారు. అయితే పీఆర్‌టీయూ బాధ్యులు మరికొన్ని పేర్లను ప్రతిపాదించారని సమాచారం. ఇక శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌లో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం ఉండగా పీఆర్‌టీయూ బాధ్యులు అక్కడికి విచ్చేశారు. ఉదయం 11 గంటలకు కలెక్టర్‌ను కలిసి తాము సూచించిన పలువురికి అవార్డుకు ఎంపిక చేయాలని కోరినట్లు సమాచారం. ఈవిషయంపై చర్చించిన తర్వాత 55మందితో కూడిన మూడో జాబితా వెల్లడించారు. ఆ తర్వాత మరో ఏడుగురి పేర్లను కూడా చేర్చాలని ఓ ఉపాధ్యాయ సంఘం కోరడంతో చివరికి 62మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందజేశారు. అందులో దరఖాస్తులు చేసిన వారందరీతో పాటుగా నామినేటెడ్‌గా మరికొందరికి అవార్డులు అందజేశారు.
తొలి జాబితాను సవరించి రెండోజాబితా
ఆయాసంఘాల ప్రాతినిథ్యంతో
మూడోజాబితా కూడా..