
ధాన్యం మాయం!
సాక్షి ప్రతినిధి, వరంగల్ :
కస్టం మిల్లింగ్ ధాన్యం ఉమ్మడి వరంగల్‌లో దారి తప్పుతోంది. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యంతో కొందరు మిల్లర్లు జల్సాలు చేస్తున్నారు. 45–60 రోజుల వ్యవధిలో బియ్యం రూపంలో తిరిగి చెల్లించాల్సిన కొంతమంది రైస్ మిల్లర్లు బయట అమ్ముకుంటున్నారు. ఏటా ఇదే తంతు సాగుతుండగా.. కట్టడి చేయాల్సిన పౌర సరఫరాల శాఖ అధికారులు కొందరు వారికి కొమ్ముకాస్తున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2022–23 సంవత్సరానికి గాను సుమారు రూ.221 కోట్ల యాసంగి ధాన్యం మాయమైంది. తనిఖీలు చేపట్టిన రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.. 29కిపైగా.. మిల్లుల్లో 1.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు తేల్చారు. సీఎంఆర్ ధాన్యాన్ని దారి మళ్లించి కొందరు రైస్ మిల్లర్లు భూములు కొనుగోలు చేసి రియల్ దందా చేస్తున్నారు. ధాన్యం కాజేసిన మిల్లర్లు వాయిదాల మీద వాయిదాలు పెడుతున్నారే తప్ప సర్కారుకు చెల్లించడం లేదు. అయినా అందులోని కొందరికి మళ్లీ 2024–25 యాసంగి సీఎంఆర్ ఇవ్వడం గమనార్హం.
చెల్లింపులో మీనమేషాలు
2022–23 యాసంగి సీజన్‌లో సీఎంఆర్ ధాన్యం తీసుకున్న చాలా మంది మిల్లర్లు తిరిగి చెల్లించలేదు. దీంతో ఆ మిల్లుల్లో ధాన్యాన్ని విక్రయించేందుకు పౌర సరఫరాల శాఖ 2024 ఫిబ్రవరిలో టెండర్లు నిర్వహించింది. ఈమేరకు ఉమ్మడి వరంగల్‌లో జిల్లాల వారీగా టెండర్లు దక్కించుకున్న వారు ఆగస్టులో తీసుకెళ్లేందుకు వెళ్లగా.. ఆయా మిల్లుల్లో ధాన్యం లేదు. దీంతో వాళ్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను ఏర్పాటు చేసి సుమారు రూ.221 కోట్ల విలువైన 1.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దారిమళ్లినట్లు గుర్తించి నివేదిక ఇచ్చారు. హనుమకొండ జిల్లాలో 15 వేలు, వరంగల్‌లో 36, మహబూబాబాద్ జిల్లాలో 44 వేల మె.టన్నుల ధాన్యం మాయం కాగా.. జనగామ, ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో 21 వేల టన్నుల ధాన్యం పక్కదారి పట్టినట్లు నిర్ధారించారు. ఈవిషయమై చాలా మంది మిల్లర్లపై (6ఏ) కేసులు నమోదు చేసి, రికవరీ కోసం నోటీసులు జారీ చేశారు. దీంతో ధాన్యం విలువ మేరకు సర్కారుకు డబ్బులు చెల్లిస్తామని కొందరు రైస్‌మిల్లర్లు అంగీకరించారు. ఈమేరకు జూన్ 10 వరకు 1.16 లక్షల మె.టన్నులకు సంబంఽధించిన బియ్యం చెల్లించాలని అగ్రిమెంట్ ఇచ్చారు. దీంతో తిరిగి.. ఇందులో చాలా మందికి 2024–25 సీఎంఆర్ కూడా కేటాయించారు. ఇందుకు సంబంధించిన లావాదేవీలు జరిగినా, జూన్ 10 నాటికి డిఫాల్టర్లుగా ఉన్నవారు 2022–23కు సంబంధించిన బియ్యం చెల్లించలేదు. ఈ విషయమై తదుపరి చర్యల కోసం కమిషనర్‌కు లేఖ రాశామని, వారి సూచనలు మేరకు ముందుకు వెళ్తామని అధికారులు చెబుతున్నారు.
అధికారులకు వరంగా సీఎంఆర్ బకాయి..
సీఎంఆర్ బకాయిలు కొంతమంది అధికారులకు వరంగా మారాయనే చర్చ జరుగుతోంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లర్లకు కేటాయించి.. తిరిగి బియ్యం స్వీకరించే ప్రక్రియలో కొందరు అధికారుల తీరు ఇప్పటికే వివాదాస్పదంగా మారింది. అలాంటి వారు 2022–23 సంవత్సర ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రైస్‌మిల్లర్ల నుంచి రాబట్టడంలో కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారని కొందరు రైస్‌మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ ఉద్యోగులు చర్చించుకుంటుండడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఉమ్మడి జిల్లాలో రూ.221 కోట్ల విలువైన 1.16 లక్షల మెట్రిక్ టన్నులు రాబట్టడంపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ మేరకు మళ్లీ రికవరీపై సీరియస్‌గా స్పందించిన జిల్లా అధికారులు మిల్లులకు నోటీసులు పంపే వరకు వెళ్లినట్లు సమాచారం. రాష్ట్రస్థాయి నుంచి మొదలైన ఒత్తిడి నేపథ్యంలో.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు జిల్లాలకు చెందిన మేనేజర్లు, ఓ జిల్లాకు చెందిన డీఎస్‌ఓ రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఆయా జిల్లాల్లో ధాన్యం మాయం చేసిన మిల్లర్ల పక్షాన ఆ పై అధికారులతో మంతనాలు జరుపుతూ వెసులుబాటు కల్పించారన్న ప్రచారం ఉంది. కాగా, ఆ నోటా.. ఈనోటా రాష్ట్ర స్థాయి అధికారులకు చేరిన ఈ వ్యవహారంపై వారు కూడా ఆరా తీస్తుండడం హాట్‌టాపిక్‌గా మారింది.
రెండేళ్లు గడుస్తున్నా సర్కారుకు చేరని సీఎంఆర్
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1.16 లక్షల మెట్రిక్ టన్నులు
మాయమైన ధాన్యం విలువ
రూ.221 కోట్లకు పైనే
నిర్ధారించి నివేదిక ఇచ్చిన
ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు
కస్టమ్ మిల్లింగ్ ధాన్యంతో మిల్లర్ల జల్సా
రికవరీపై సివిల్ సప్లయీస్
మీనమేషాలు