
అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దు..
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్ : ప్రజావాణిలో స్వీకరించిన అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్.. ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్ హాజరై ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన వినతులను సంబంధిత శాఖల అధికారులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 283 వినతులు వచ్చినట్లు తెలిపారు. కాగా, దరఖాస్తు ఇచ్చిన తర్వాత ఆలస్యం లేకుండా రసీదు అందించేందుకు అదనపు సిబ్బందిని నియమించారు.
అధికారుల గైర్హాజర్‌పై కలెక్టర్ ఆగ్రహం
ప్రజావాణి కార్యక్రమానికి కొన్ని శాఖల ఉన్నతాధికారులు రాకపోవడంపై కలెక్టర్ స్నేహ శబరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావాణి అనంతరం అధికా రుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. కొన్ని శాఖల అధికారులు ప్రజావాణికి హాజరుకాకపోవ డం, మరికొన్ని శాఖల ఉన్నతాధికారులు తమ సిబ్బందిని పంపించడంతో కలెక్టర్ అసహనం వ్య క్తం చేశారు. వారిని ప్రజావాణికి పిలిపించి తీవ్రంగా మందలించారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తే కనీసం ఉన్నతాధికారులు కలవకపోతే ఎలా అని అన్నారు. తప్పనిసరి రాలేని పరిస్థితి ఉంటే కలెక్టర్‌కు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు.
హాస్టళ్ల పర్యవేక్షణ తప్పనిసరి
జిల్లాలోని ఆయా శాఖల అధికారులకు కేటాయించిన ప్రభుత్వ హాస్టళ్ల పర్యవేక్షణను క్రమం తప్పకుండా నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా అధికారులు, తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. తనిఖీలకు వెళ్లిన సమయంలో బేసిక్ చెక్ లిస్టు ప్రకారం వసతులు ఉన్నాయా లేదా అని పరిశీలించాలని తెలిపారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలువురు తహసీల్దార్లతో కలెక్టర్ మాట్లాడారు. అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్‌ఓ వై.వి గణేష్, డీఆర్‌డీఓ మేన శ్రీను, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
పంచాయతీ రాజ్ పనులపై సమీక్ష..
హనుమకొండ జిల్లాలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ చేపట్టిన వివిధ పనుల పురోగతి, నూతన పనులపై అధికారులతో కలెక్టర్ స్నేహ శబరీష్ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఆయా మండలాల్లో కమ్యూనిటీ హాల్స్, గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల అధ్వర్యంలో చేపట్టిన పనుల పురోగతిని పంచాయతీరాజ్ శాఖ ఈఈ ఆత్మారాం, డీఈలు, ఏఈలు కలెక్టర్‌కు వివరించారు. సమావేశంలో డీఈలు శ్రీనివాసరావు, జయశంకర్, శిరీష, యుగంధర్, ఏఈలు పాల్గొన్నారు.
ఆస్పత్రికి తాళంపై కలెక్టర్ సీరియస్
కాజీపేట : కాజీపేట 62వ డివిజన్ సోమిడి ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ అర్బన్ హెల్త్ సెంటర్‌ను కలెక్టర్ స్నేహ శబరీష్ సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో సిబ్బంది తాళం వేసుకుని వెళ్లడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంహెచ్‌ఓ అప్పయ్యకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించడంతో సిబ్బందితోపాటు ఆయన ఆగమేఘాల మీద ఆస్పత్రికి చేరుకున్నారు. సమయపాలన, రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్‌లో నమోదు లోపాలపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.
అంటువ్యాధులు ప్రబలకుండా
జాగ్రత్తలు తీసుకోవాలి : శశాంక
వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా అధికారులు ముందస్తు నివారణ చర్యలను చేపట్టాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి కె.శశాంక సూచించారు. హనుమకొండ ఐడీఓసీ సమావేశ మందిరంలో సోమవారం రాత్రి వివిధ విభాగాల అధికారులతో ఆయన సమీక్షించారు. కలెక్టర్ స్నేహ శబరీష్, వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, నగర కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీసీపీ సలీమా, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.