
‘ఫెర్టిలిటీ’పై నిఘా
సాక్షి, వరంగల్: హైదరాబాద్ రెజిమెంటల్ బజార్‌లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో బహిర్గతమైన మోసం పాఠకులకు తెలిసిందే. ఈనేపథ్యంలో గ్రేటర్ వరంగల్‌లోని సంతాన సాఫల్య కేంద్రాలపై వైద్య ఆరోగ్యశాఖ, పోలీసులు కన్నేశారు. సరోగసి ముసుగులో శిశు విక్రయాలు చేస్తూ.. ఇక్కడ కూడా ఆ తరహా వ్యాపారం ఏమైనా జరుగుతోందా? అనే దిశగా దృష్టి సారించారు. ఈ త్రినగరిలో పదుల సంఖ్యలో సంతాన సాఫల్య కేంద్రాలు ఉండడం, ఇక్కడ కూడా వందల సంఖ్యలో పిల్లలు లేని దంపతులు సంప్రదిస్తుండడంతో సరోగసి ముసుగులో శిశు విక్రయాలు జరుగుతున్నాయా అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.
అప్రమత్తమైన వైద్య శాఖ
ఆయా కేంద్రాల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు క్షుణ్ణంగా రికార్డులను తనిఖీ చేస్తున్నారు. అన్నింటికీ అనుమతులు ఉన్నాయా? లేవా? ఉంటే నిబంధనలు పాటిస్తున్నారా? అనే సమాచారాన్ని సేకరిస్తున్నారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నుంచి వచ్చిన ఆదేశాలతో ఇక్కడి అధికారులు అప్రమత్తమయ్యా రు. సరోగసీ ద్వారా బిడ్డను పొందిన దంపతులకు నిజంగా వారి అండాలు, శుక్రకణాల ద్వారానే పొందారా? లేదా అక్రమ శిశు విక్రయాలు ద్వారా బిడ్డ వచ్చిందా? అనే విషయాలు తెలుసుకుంటున్నారు.
‘క్యాష్’ చేసుకోవడానికే..
సంతానోత్పత్తి కోసం సరోగసి పేరుతో జరుగుతున్న దందాకు చెక్ పెట్టడానికి 2021లో ది సరోగసీ (రెగ్యులర్) యాక్ట్‌ను అమలులోకి తీసుకొచ్చింది. దీంతో ప్రభుత్వ అనుమతితోనే సంబంధీకుల ద్వారానే సరోగసి ద్వారా బిడ్డలు పొందే అవకాశం ఉంది. వివిధ వృత్తుల రీత్యా ఒత్తిడితో పెరిగిపోతున్న సంతాన లేమి సమస్యను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం 2023లో ఈ చట్టంలో కొన్ని మార్పులు చేసింది. దీని ప్రకారం సంతానం ఆశించే భార్యభర్తలు ఎగ్, స్పెర్మ్ డొనేషన్ విధానంలో తీసుకునే అవకాశం కల్పించింది. భార్యలో లోపం ఉంటే డోనర్ అయిన మహిళ నుంచి, భర్తలో లోపం ఉంటే డోనర్ అయిన పురుషుడి నుంచి స్మెర్మ్ తీసుకోవచ్చు. ఈ వ్యవహారాల్లో ఎక్కడా ఆర్థిక లావాదేవీలు, క్రయ,విక్రయాలకు ఆస్కారం ఉండకూడదు. దీన్ని క్యాష్ చేసుకోవడానికి అనేక అక్రమ కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. సంతాన భాగ్యం లేని దంపతుల్లో ఉన్న లోపాలను క్యాష్ చేసుకోవడానికి దందాలు ప్రారంభించాయి. లైసెన్స్ ఉన్న అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్టీ) బ్యాంక్‌లకు అనుబంధంగా, వాటితో సంబంధం లేకుండా వెలసిన అక్రమ కలెక్షన్ ఏజెన్సీలు ఎన్నో ఉంటున్నాయి. ఓ రాష్ట్రం, నగరంలో దందా చేసే సరోగసి కేంద్రంగా మరో ప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీల నుంచి వీటిని ఖరీదు చేస్తున్నాయి. తమ ఉనికి, దందా బయటపడకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నట్టు వైద్య వర్గాలంటున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాకంతో అక్రమ శిశు విక్రయాలు రూ.లక్షల్లో జరిగిందని వెలుగులోకి రావడంతో గ్రేటర్ వరంగల్‌లోనూ అనుమానాలకు తావిస్తోంది. అయితే సంతాన సాఫల్య కేంద్రాల్లో తనిఖీలపై వైద్య, పోలీసు వర్గాలు ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా ధ్రువీకరించడం లేదు.
హైదరాబాద్ ‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ ఘటనతో కదలిక
గ్రేటర్ వరంగల్‌లో పుట్టగొడుగుల్లా ఫెర్టిలిటీ కేంద్రాలు
ఇక్కడ కూడా శిశు విక్రయాలు జరిగాయా? అనే కోణంలో ఆరా..