
వరంగల్ : ఇండిగ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు– 2023కు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంపికై నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈనెల 22, 23 తేదీల్లో వర్చువల్‌గా ఢిల్లీ నుంచి అవార్డు అందజేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు గురువారం తెలిపారు.అమ్మవారిపేటలో మల, బురద ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎఫ్‌ఎస్‌టీపీ), శానిటేషన్ రిసోర్స్ పార్కు అభివృద్ధి చేసినందుకు ఇండిగ్లోబల్ సంస్థ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపిక చేసినట్లు బల్దియా అధికారులు పేర్కొన్నారు. గ్రేటర్ అవార్డుకు ఎంపిక కావడం పట్ల మేయర్ గుండు సుధారాణి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవార్డు రావడానికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రులు, ప్రభుత్వ చీఫ్‌విప్, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, బల్దియా కమిషనర్, అధికారులు సహకారం అందించారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మూడేళ్ల క్రితమే అమ్మవారిపేటలో ఎఫ్‌ఎస్‌టీపీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మలాన్ని ఎరువుగా మార్చడం వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. ఇటీవల బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్ దేశాల మేయర్లు, ప్రజాప్రతినిధులు, గ్రేటర్ వరంగల్‌ను సందర్శించి, పారిశుద్ధ్య విధానాలను పరిశీలించారని తెలిపారు. తమ తమ పట్టణాల్లో వీటిని అమలు చేస్తామని తెలిపారని అన్నారు. మరో ప్లాంట్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఇదే స్ఫూర్తి కొనసాగిస్తూ స్వచ్ఛ వరంగల్‌గా తీర్చిదిద్దాలని ఆమె పిలుపునిచ్చారు.
నేడు వర్చువల్‌గా అందించనున్న సంస్థ
మేయర్ గుండు సుధారాణి హర్షం