సాక్షి, వరంగల్ : బీఆర్‌ఎస్ వరంగల్ తూర్పు అభ్యర్థి నన్నపునేని నరేందర్‌ను మార్చకుంటే తాము పార్టీ మారేందుకు కూడా వెనుకాడేదిలేదని అధికార పార్టీకి చెందిన మెజారిటీ కార్పొరేటర్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావుకు ఫిర్యా దు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. సామాజిక మధ్యమాల్లో ఈ విషయం వైరల్ కావడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. అల్పాహారానికి గురువారం తూర్పులోని అధికార పార్టీ కార్పొరేటర్ తన ఇంటికి పలువురు కార్పొరేటర్లను ఆహ్వానించారు. ఒక పీఎసీఎస్ చైర్మన్, 13 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు తమ ఇబ్బందులను వెల్లడించినట్లు తెలిసింది. పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చుపెట్టి గెలిస్తే తమ డివిజన్లలో ఎలాంటి అధికారం, గౌరవం లేదని వాపోయారు. డివిజన్ కమిటీల పేరుతో ఎమ్మెల్యే తన అనుచరులను నియమించి అభివృద్ధి, పార్టీ కార్యక్రమాలను వారితో నిర్వహిస్తుంటే తమను కార్పొరేటర్లుగా ప్రజలు గుర్తించడం లేదని ప్రస్తావించినట్లు తెలిసింది. సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే ప్రజల ముందే అవహేళనగా మాట్లాడుతుంటే ఎలా భరించాలని కొందరు పేర్కొన్నట్లు సమాచారం. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు ఎవరు కూడా కార్పొరేటర్లను ఇంత హీనంగా చూడలేదని, ప్రస్తుత ఎమ్మెల్యేను కాదని ఏదైనా కార్యక్రమం చేపడితే తర్వాత పోలీసులతో వేధింపులకు గురిచేస్తున్నాడని, ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఉదహరించినట్లు వినికిడి. ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితంగా ఉండే ఒక కార్పొరేటర్ మరోసారి ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్దామని సలహా ఇవ్వడంతో సదరు కార్పొరేటర్‌పై మిగిలిన కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మరోసారి చెప్పి చూద్దాం.. లేకుంటే మీతో పాటు నేను కూడా కలిసి వస్తా’నని హామీ ఇవ్వగా.. మిగిలిన వారు సరే అంటూ చివరిగా అవకాశం ఇద్దామన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిద్దామని, వీలుకాకుంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సమావేశంపై పోలీసు నిఘా బృందాలు సైతం నివేదికలను ప్రభుత్వానికి పంపగా.. బీఆర్‌ఎస్ అధిష్టానం సైతం ఆరా తీస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
లేకుంటే పార్టీ మారుతాం
తూర్పు ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలతో
విసిగిపోయాం
13 మంది కార్పొరేటర్ల
రహస్య మంతనాలు
సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావుకు ఫిర్యాదు చేయాలని నిర్ణయం?