
కొండా సురేఖ, ఎర్రబెల్లి స్వర్ణ, సామల ప్రదీప్
సాక్షి, వరంగల్: వరంగల్ తూర్పు కాంగ్రెస్‌లో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇప్పటికే ఆరు గ్యారంటీ స్కీంలతో జనాల్లోకి వెళ్తున్న ఆ పార్టీ నాయకులు ఎవరికి వారుగా టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఇక్కడి నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి కొండా సురేఖ గత ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేసినా...ఇప్పుడు మళ్లీ వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అదే సమయంలో డీసీసీ అధ్యక్షురాలు ఎరబ్రెల్లి స్వర్ణ కూడా ఎప్పటినుంచో పార్టీని అంటిపెట్టుకొని ఉన్నానని, అవకాశం తనకే ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూఎస్‌ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ సామల ప్రదీప్ కొన్నేళ్లుగా సామల జయశంకర్ ఫౌండేషన్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇటీవల వరంగల్ పార్లమెంట్ స్థానాలపై సమీక్షకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వచ్చిన సమయంలో తనలాంటి గట్టి నేత ఉన్న నియోజకవర్గంలోనే టికెట్‌పై క్లారిటీ లేకపోవడంతో జనాల్లో కన్ఫ్యూజన్ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో ఇక్కడి స్థానం నుంచి పోటీ చేసేందుకు ఎవరికి వారుగా ఎంత గట్టి ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఆ ముగ్గురి మధ్య పోటీ ఎక్కువ..
వరంగల్ తూర్పు నుంచి 8 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కొండా సురేఖ, ఎరబ్రెల్లి స్వర్ణ, సామల ప్రదీప్ కుమార్, భవంతుల రాధిక, సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని, డాక్టర్ కత్తి వెంకటస్వామి, ఎంబాడి రవీందర్, బారుపాటి రవీందర్ పోటీ చేస్తామని ముందుకు వచ్చారు. దీనిపై ఇప్పటికే దఫాల వారీగా సర్వేలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం...ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ భేటీ అయి ఫైనల్ చేసే ప్రయత్నాల్లో ఉంది. దీంతో ఆయా అభ్యర్థులు ఎవరికి వారుగా టికెట్ ఫైనల్ చేసుకునేందుకు తమకు దగ్గరైన ముఖ్య నేతల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొండా సురేఖ, ఎరబ్రెల్లి స్వర్ణ, సామల ప్రదీప్ కుమార్ మధ్య పోటీ ఎక్కువగా ఉన్నట్టుగా పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే కొండా సురేఖ ఇక్కడా ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండడం అదనపు బలం కాగా, నాలుగేళ్లుగా ఏమీ పట్టించుకోకుండా ఇటీవల తిరిగి కార్యక్రమాలు ముమ్మరం చేసినా కూడా ప్రజలను మెప్పించే ప్రయత్నం జరుగుతుందా అన్న చర్చ కూడా ఉంది. ఇంకోవైపు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎరబ్రెల్లి స్వర్ణ తాను ఎప్పటి నుంచే పార్టీ కోసం పనిచేస్తున్నానని, గతంలో మేయర్‌గా పనిచేసిన అనుభవం ఉండడంతో పాటు ఇక్కడి నేతలు, ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయనే వాదన వినిపిస్తున్నారు. సామల ప్రదీప్ కుమార్ నాలుగేళ్లుగా సామల జయశంకర్ ఫౌండేషన్ ద్వారా కరోనా సమయంలో రోగులకు సలహాలు ఇచ్చేందుకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయ డం, ఎంజీఎంలో అవసరమైన ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు విరాళంగా ఇవ్వడంతోపాటు అవసరార్థులకు ఆహారాన్ని అందించారు. అమెరికాలో రాహుల్ గాంధీతో ఏర్పడిన పరిచయం కూడా తనకు ప్లస్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. ముగ్గురి మధ్య పోటీ ఎక్కువగా ఉండడంతో ఎవరిని టికెట్ వరిస్తుందోనన్న చర్చ కాంగ్రెస్‌లో జోరుగా సాగుతోంది. ఈ నెలాఖరు వరకు దీనిపై స్పష్టత రానుంది. సాధ్యమైనంత తొందరగా టికెట్ ప్రకటిస్తే ఇటు పార్టీ శ్రేణులు, అటు ప్రజలను కలుపుకొని పోయే అవకాశం ఉందని ఆశావహులు అంటున్నారు.
కొండా సురేఖ, ఎరబ్రెల్లి స్వర్ణ,
సామల ప్రదీప్ కుమార్ ప్రయత్నాలు
ఓవైపు రాజకీయ అనుభవం,
ఇంకోవైపు సామాజిక సేవ
కలిసొస్తుందనే లెక్కలు
ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ భేటీతో
ఎవరికి వారుగా లాబీయింగ్
ఇటీవల కొండా వ్యాఖ్యలతో
నియోజకవర్గంలో కన్ఫ్యూజన్‌పై చర్చ
సాధ్యమైనంత త్వరగా టికెట్ ఖరారు చేస్తే జనాలతో ఇంకా మమేకం

