
హన్మకొండ చౌరస్తా: సోనియాగాంధీ.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అర్థం చేసుకుని రాష్ట్రం ఇచ్చి తన మాట నిలబెట్టుకున్నారని సీడబ్ల్యూసీ సభ్యుడు సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని కాంగ్రెస్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ అభ్యున్నతికి ఆరు గ్యారంటీలను పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని సూచించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే వంచించిందని, బీజేపీ, బీఆర్‌ఎస్ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు. బీజేపీ.. సీబీఐ, సీఐడీ, ఈడీ, ఇన్‌కమ్ ట్యాక్స్‌ల పేరుతో ప్రతిపక్షాల గొంతులు నొక్కుతుందని ధ్వజమెత్తారు. ప్రజలు ప్రేమ, ఐకమత్యంతో ఉండాలని రాహుల్‌గాంధీ ‘భారత్ జోడో’ యాత్ర చేపడితే కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోందన్నారు. ఇండియా కూటమితో ప్రధానికి మోదీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే భారత్‌గా పేరు మారుస్తానని అంటున్నారని విరుచుకుపడ్డారు. ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి మాట్లాడుతూ రాహుల్‌గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్‌తో తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరితే, కాంగ్రెస్ విజయభేరితో మరింత జోష్ పెరిగిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చూడాలనే సోనియాగాంధీ కల నెరవేరబోతుందన్నారు. అందుకు నాయకులు, కార్యకర్తలు అహర్నిషలు కృషి చేయాలన్నారు. తెలంగాణలో బడుగు, బలహీన వర్గాల యువకుల ఆశలు గల్లంతయ్యాయని , కేసీఆర్ కుటుంబం మాత్రం బాగుపడిందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం ఒక్కటేనని, బయట తిట్టుకుంటూ లోపల కలిసి ఉంటారని అన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ పరిశీలకుడు రవీంద్ర ఉత్తమ్ రావు దళ్వి, పంజాబ్ పీసీసీ చీఫ్ లక్కీ, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, హనుమకొండ, వరంగల్ డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, నాయకులు అజ్మతుల్లా, డాక్టర్ రియాజ్, సాంబయ్య, శ్రీనివాసరావు, ఇనుగాల వెంకట్రాంరెడ్డి, నమిండ్ల శ్రీనివాస్, కత్తి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
సీడబ్ల్యూసీ సభ్యుడు సల్మాన్ ఖుర్షీద్