
నాలాల్లో పూడీకతీత పనులను తనిఖీ చేస్తున్న మేయర్ సుధారాణి, కమిషనర్ రిజ్వాన్ బాషా
వరంగల్ అర్బన్: ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్)దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, అందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించాలని నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాలు ఆదేశించారు. బుధవారం వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఆదాయం వచ్చే ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిశీలించి వారం రోజుల్లో యజమానులకు సమాచారం అందించాలన్నారు. అనంతరం జంక్షన్ల విస్తరణ, అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై విశిష్ట ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏజెన్సీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో ఎస్‌ఈ ప్రవీణ్ చంద్ర, సిటీ ప్లానర్ వెంకన్న, ఈఈలు శ్రీనివాస్, సంజయ్ కుమార్, ఆస్కీ రాజమోహన్ రెడ్డి, పాల్గొన్నారు.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్
సెంటర్ పరిశీలన
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను త్వరగా ప్రారంభించేందుకు వేగవంతంగా పనులు చేపట్టాలని నగర మేయర్ అధికారులను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయం నూతన సమావేశ మందిర భవనం మొదటి అంతస్తులో రూ.90 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనుల పురోగతిని మేయర్, కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాలు పరిశీలించారు. భవనం ఫినిషింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. అనంతరం బొందివాగు నాలా, శాకరాసికుంట నాలా, 12 మోరీల నాలా, వరంగల్ అండర్ బ్రిడ్జ్ నాలాల పూడికతీత పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అదేవిధంగా నయీంనగర్ నుంచి వచ్చే నాలా పూడికతీతను గుండ్ల సింగారం ప్రాంతంలో కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా పరిశీలించారు. తనిఖీల్లో ఎస్‌ఈ కృష్ణారావు, ఈఈ శ్రీనివాస్, డీఈలు నరేందర్, రవి కుమార్, ఏఈ ముజమ్మిల్ తదితరులు పాల్గొన్నారు.
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి,
కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా