ప్రయాణికులు సురక్షితం
కాచవరం(ఇబ్రహీంపట్నం): షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కాచవరం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. ఆ సమయంలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఎస్‌ఐ సన్యాసి నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తుళ్లూరు గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ కలాం తన కుటుంబ సభ్యులతో కలిసి కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామంలోని బంధువుల ఇంటికి కారులో బయలుదేరారు. కాచవరం పెట్రోల్ బంక్ వద్దకు రాగానే కారులో విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ కారును రోడ్డు పక్కన నిలిపి వేయడంతో కారులో ఉన్న వారు సురక్షితంగా కిందికి దిగారు. క్షణాల వ్యవధిలో కారు పూర్తిగా దగ్ధమైంది. సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్‌కు ఎటువంటి ప్రమాదం జరుగలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


