తెనాలి: 24 ఫ్రేమ్స్ వ్యవస్థాపకుడు, సీఈవో, నికాన్ ఇండియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫణి గోగిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఏపీపీవీడబ్ల్యూఏ) ఆంధ్రప్రదేశ్ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తెనాలి సమీపంలోని చుండూరు మండల మోదుకూరుకు చెందిన ఫణి గోగిరెడ్డి హైదరాబాద్‌లో 24 ఫ్రేమ్స్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ అసోసియేషన్‌కు సలహాదారుగా సేవలందిస్తున్న ఆయనకు, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఫొటోగ్రఫీ రంగానికి తోడ్పడే అవకాశం లభించింది. హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన ఫొటోట్రేడ్ ఎక్స్‌పోలో అతిథి వక్తగా పాల్గొన్న ఫణి గోగిరెడ్డి, ‘ఫోకస్ ఆన్ గ్రోత్–లాభదాయకమైన ఫొటోగ్రఫీ వ్యాపారాన్ని ఎలా విస్తరించాలి’ అనే అంశంపై ప్రసంగించారు. ఏపీపీవీడబ్ల్యూఏ ప్రధాన సభ్యులు ఆయనను సలహాదారుగా వ్యవహరించాలని ఆహ్వానించారు. తనపై ఉంచిన నమ్మకానికి సంఘ సభ్యులకు ఫణి గోగిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తన అనుభవాలను పంచుకుంటూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఫొటోగ్రాఫర్ల వృత్తిపరమైన, వ్యాపారపరమైన అభివృద్ధికి తోడ్పడేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు.


