కార్గిల్‌ యుద్ధ అమరవీరులకు నివాళి | - | Sakshi
Sakshi News home page

కార్గిల్‌ యుద్ధ అమరవీరులకు నివాళి

Jul 27 2026 1:54 AM | Updated on Jul 27 2026 1:54 AM

కార్గిల్‌ యుద్ధ అమరవీరులకు నివాళి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారిణి ప్రతిభ వాయిదాల పాలనకు చరమగీతం వెనిగండ్లలో ఇరువర్గాల ఘర్షణ.. ముగ్గురికి గాయాలు

గుంటూరు లీగల్‌: కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా యుద్ధంలో పాల్గొన్న వీరజవాన్ల సంస్మరణ కార్యక్రమాన్ని స్థానిక గుంటూరు జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. కార్గిల్‌ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్న 14 మంది సైనికులను గుంటూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి సయ్యద్‌ జియాఉద్దీన్‌న్‌ సత్కరించి మాట్లాడారు. కార్గిల్‌ ఆపరేషన్‌ విజయ్‌లో మన సైనికులు చూపిన ధైర్యం, త్యాగం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిందని చెప్పారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ప్రవేశపెట్టిన వీర్‌ పరివార్‌ సహాయత యోజనపై కార్గిల్‌ యుద్ధ వీరులకు, వారి కుటుంబాలకు, అమరవీరుల కుటుంబాలకు, మాజీ సైనికులకు ఉచిత న్యాయ సహాయం, చట్టపరమైన సలహాలు, పెన్షన్‌, సంక్షేమ సదుపాయాల విషయంలో సహాయం ఈ పథకం ద్వారా అందుతుందని న్యాయమూర్తి వివరించారు. జిల్లా సైనిక సంక్షేమాధికారి గుణశీల మాట్లాడుతూ డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, న్యాయమూర్తి సహాయంతో ఇప్పటి వరకు 40 మందికిపైగా సైనిక కుటుంబాల సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం సూపరింటెండెంట్‌ ఆనందరావు, డీఎల్‌ఎస్‌ఎ ప్యానల్‌ సీనియర్‌ న్యాయవాది కె.కాళిదాసు, డీఎల్‌ఎస్‌ఎ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్స్‌ జె.సురేష్‌బాబు, ఐ.మధుబాబు, ఎల్‌.సుబ్బయ్య, లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ న్యాయవాది పి.రాజేష్‌ లింగం, డీఎసల్‌ఎస్‌ఏ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ వాణి, ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులు, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా సైనిక కుటుంబ సభ్యులు, పారాలీగల్‌ వలంటీర్లు పాల్గొన్నారు.

మంగళగిరి టౌన్‌: నేషనల్‌ సబ్‌ మాస్టర్స్‌ (మెన్‌ అండ్‌ ఉమెన్‌) క్లాసిక్‌ అండ్‌ ఎక్యూప్డ్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో గుంటూరు జిల్లాకు చెందిన క్రీడాకారిణి ప్రతిభ చాటినట్లు జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి విజయభాస్కరరావు, షేక్‌ సంధాని తెలిపారు. మంగళగిరి పట్టణంలోని కార్యాలయంలో ఆదివారం పతకాలు సాధించిన క్రీడాకారిణి జ్యోతివర్మ దంపతులను సత్కరించి మెమెంటో అందజేశారు. వారు మాట్లాడుతూ ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు మహారాష్ట్రలో జరిగిన ఈ పోటీల్లో పవర్‌ లిఫ్టర్‌ జ్మోతివర్మ మాస్టర్స్‌ –2 విభాగంలో పాల్గొని మూడు పతకాలు సాధించినట్లు తెలిపారు. 69 కేజీల క్లాసిక్‌ అండ్‌ ఎక్యూప్డ్‌, క్లాసిక్‌ డెడ్‌ లిఫ్ట్‌ విభాగాల్లో బ్రాంజ్‌ మెడల్‌, బెంచ్‌ ప్రెస్‌, డెడ్‌ లిఫ్ట్‌లో సిల్వర్‌ మెడల్స్‌ సాధించినట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో జిల్లాకు మూడు పతకాలు సాధించడం గర్వకారణమని వారు కొనియాడారు.

ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం వాయిదాలు వేయడం తప్ప పరిష్కారం చూపడం లేదని రాష్ట్రోపాధ్యాయ సంఘ(ఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి ఆరోపించారు. వాయిదాల పాలనకు ఉద్యోగ, ఉపాధ్యాయ ఉద్యమం ద్వారా చరమగీతం పాడుతామని హెచ్చరించారు. ఆదివారం కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్‌లో ఎస్టీయూ ఆధ్వర్యంలో ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్‌ శిక్షణ తరగతులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రఘునాథరెడ్డి మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు, న్యాయమైన వేతన సవరణను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏఐఎస్టీఎఫ్‌ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్‌ జోసఫ్‌ సుధీర్‌ బాబు, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వర రావు, రాష్ట్ర సంయుక్త అధ్యక్షుడు డి.పెదబాబు మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన ఆర్థిక కార్యదర్శులు శ్యాంబాబు, హనుమత్‌ ప్రసాద్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.అమరనాథ్‌ పాల్గొన్నారు.

పెదకాకాని: పశులు మేపుకునే విషయంలోలో చోటు చేసుకున్న వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. పెదకాకాని మండల పరిధిలోని వెనిగండ్ల గ్రామానికి చెందిన కొల్లికొండ శివయ్యకు ఇంటి ఎదురుగా ఉన్న కొల్లికొండ సాయికి పశువుల మేత విషయంలో గురువారం వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదం రాత్రి ఇళ్ల వద్ద రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కొల్లికొండ శివయ్య, అతని కుమారుడు గోపీనాథ్‌ తలలు పగిలి రక్తగాయాలయ్యాయి. అలానే మరొక వర్గానికి చెందిన కొల్లికొండ సాయికి కంటి పక్కన, చేతికి గాయమైంది. ఈ దాడిలో గాయపడిన వారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని పెదకాకాని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలకు చెందిన కొల్లికొండ శివయ్య, గోపీనాథ్‌, శివయ్య భార్యలపై ఆనందరావు ఫిర్యాదు చేయగా ఆనందరావు, సాయి, అంజమ్మ, కోటమ్మ మరి కొందరిపై శివయ్య ఫిర్యాదు చేశాడు. విచారించి కేసు నమోదు చేయడం జరుగుతుందని సీఐ టీపీ నారాయణస్వామి ఆదివారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement